మెడికో ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యే: బండి సంజయ్‌

Bjp Chief Bandi Sanjay Comments on Cm Kcr - Sakshi

సాక్షి, వరంగల్‌ జిల్లా: మెడికో ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది ప్రీతి కాదని, ఒకవేళ ఆత్మహత్య చేసుకుందని ప్రభుత్వం భావిస్తే అందుకు సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జీచే న్యాయ విచారణ జరిపించాలని కోరారు.

తప్పు లేకపోతే ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులను బండి సంజయ్ పరామర్శించారు.‌ ఆయన రాకతో బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రీతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు. అడ్డుకునే ప్రయత్నం చేయగా బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. బండి సంజయ్ ముందు ప్రీతి తల్లిదండ్రులు నరేందర్ శారద తమ గోడును వెల్లబోసుకున్నారు. న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించేలా చూడాలని సంజయ్‌ని ప్రీతి తండ్రి కోరారు. న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని సంజయ్ స్పష్టం చేశారు‌. ఇప్పటికే ప్రీతి ఘటనపై ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.
చదవండి: ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఎవిడెన్స్‌..

రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి విషయాన్ని డైవర్ట్ చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ప్రీతి మృతికి కారకులైన వారందరికీ కఠిన శిక్షపడే వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలోనే ప్రీతి చనిపోయిందని, డెడ్ బాడీని నిమ్స్ తరలించి ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు డ్రామాలాడారని విమర్శించారు. సైఫ్‌ను కాపాడేందుకే కేసీఆర్ ప్రభుత్వం డ్రామాలాడుతుందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా న్యాయ పోరాటం చేస్తామన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటలపాటు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top