చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడుస్తారని.. | BJLP leader Maheshwar Reddy sensational comments | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడుస్తారని..

Apr 11 2024 4:38 AM | Updated on Apr 11 2024 4:38 AM

BJLP leader Maheshwar Reddy sensational comments - Sakshi

అందుకే కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి అంటే భయపడుతున్నారు..  

రేవంత్‌ది బాబు స్కూలే కావడంతో కలవరపడుతున్నారు

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లు ఆయన ఎప్పుడేం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది.. 

రేవంత్‌ కాంగ్రెస్‌లో కంఫర్టబుల్‌గా లేరు.. అభద్రతాభావంతో ఉన్నారు 

ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌తో చేతులు కలుపుతారు... లేదంటే 25 మంది

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సొంత దుకాణం పెట్టుకునేందుకు రెడీగా ఉన్నారు 

బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నా యని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డి కంఫర్టబుల్‌గా లేరని, నేతల తీరుతో అభద్రతా భావంతో ఉన్నారని, దీంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలసి సొంత దుకాణం పెట్టుకోవటానికి రేవంత్‌ రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం సీటు కోసం కుట్ర జరుగుతోందని రేవంత్‌కు ఇంటెలిజెన్స్‌ నివేదికలు అందినట్లు తమకు తెలుస్తోందని మహేశ్వర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తనతో వచ్చే 25 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్‌ఎస్‌తో చేతులు కలుపబోతున్నారని ఆరోపించారు.

బుధవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మహేశ్వరరెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చంద్రబాబుకు సీఎం రేవంత్‌కు చాలా దగ్గర పోలికలున్నాయనీ, రేవంత్‌ కూడా బాబు స్కూలే కావడంతో కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారన్నారు. బాబు తన మామను వెన్నుపోటు పొడిచినట్టు రేవంత్‌ కూడా కాంగ్రెస్‌ కు ఎప్పుడేం చేస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. 

ప్లాన్‌ ఏ.. ప్లాన్‌ బీతో రేవంత్‌ 
లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు యత్నిస్తున్నారని స్వయంగా సీఎం రేవంత్‌ చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్‌లో వెన్నుపో టు రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. రేవంత్‌ దగ్గరున్న రెండు ప్లాన్‌లలో...ప్లాన్‌ ఏలో తనతో పాటు ఎంత మంది వస్తారు అని, ప్లాన్‌ బీలో.. సొంత దుకాణం పెట్టుకుంటే.. ఎంతమంది వస్తారు అనే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు.

కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చే నాటికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ప్లాన్‌ లో కాంగ్రెస్‌ ఉందన్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే బీఆర్‌ఎస్‌ లో 20 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి ప్రతిపక్ష నేతను మార్చాల్సిందిగా ఫిర్యాదు చేయించేందుకు కార్యాచరణను సిద్ధమైందన్నారు. 

సీఎం పదవి కోసం 
అందరూ ఎదురు చూస్తున్నారు: సీఎం పదవి కోసం పది మంది కాంగ్రెస్‌ నేతలు పోటీ పడుతున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రెండేళ్ల పదవి పూర్తయ్యాక దిగుతారా, ఏదైనా కేసులో ఇరుక్కుని పదవి నుంచి దిగిపోతారా అని అందరూ ఎదురుచూస్తున్నారన్నారు. కేబినెట్‌లో నంబర్‌ టు స్థానం తనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భావించారని, అయితే ఆయన స్థానాన్ని దిగజార్చి సైడ్‌ చేసే కుట్ర కాంగ్రెస్‌లో జరుగుతోందన్నారు.

ఇటీవల యాదాద్రిలో భట్టిని కింద కూర్చోపెట్టారని, తుక్కుగూడ సభ సమయంలో ఆయన డ్రైవర్‌ ను కొట్టారని దీంతో ఆయనకు ఇప్పుడు అర్థమైందన్నారు. భట్టి 9 శాతం బీ టాక్స్‌ అంటూ లీక్‌ చేస్తోంది కాంగ్రెస్‌ వాళ్లేనని చెప్పారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు సైతం పది మంది ఎమ్మెల్యేలతో తమ సొంత సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పది మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌లో సైకిల్‌ కాంగ్రెస్, పింక్‌ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్‌ అనే మూడు రకాలున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రంలో ఇక అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఉప ఎన్నికలంటూ వస్తే ప్రజలు బీజేపీ వైపే ఉంటారని చెప్పారు.  

ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరేందుకే కేటీఆర్‌ యాక్షన్‌ 
తాము చేసిన తప్పులకు జైలుకెళ్లే అవకాశం ఉండడంతో కేటీఆర్‌ పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. లిక్కర్‌ కేసులో తీహార్‌ జైల్లో ఉన్న చెల్లెలు.. అక్కడ ఎండలు మండుతున్నాయనీ కనీసం ఫ్యాన్‌ కూడా లేనందున అన్నను ఇక్కడ ఉండే ప్రయత్నం చేయమని చెప్పినట్లు తెలుస్తోందన్నారు. అందుకే కేటీఆర్‌ ఇక్కడే ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరేందుకు పిచ్చి ఎక్కినట్టు నటిస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement