
సాక్షి,తిరుపతి: కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. రైతన్నకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ చేపట్టిన బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన విజయవంతమైందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.
మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగన్ చేసిన బంగారుపాళెం పర్యటన విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఈటీవీలు విషపు రాతలతో ఆయనపై ఉన్న ద్వేషాన్ని మరోసారి చాటుకున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.
తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ కోసం వచ్చిన మామిడి రైతులను క్రూరమైన దొంగలు, అసాంఘిక శక్తులు, దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఉచ్ఛం, నీచం మరిచి పతాకశీర్షికల్లో దూషించడం ద్వారా తమ కడుపుమంటను ఎల్లో మీడియా బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును మోసేందుకు, నిత్యం భజన చేసేందుకు ఆ ప్రతికలు, మీడియా ఇంతగా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...
..వైఎస్ జగన్ పర్యటనకు చిత్తూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తమ కష్టాలను చెప్పుకోవాలని తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం రెండు వేల మంది పోలీసులతో భద్రత పేరుతో అనేక ఆటంకాలు కల్పించింది. లాఠీచార్జీతో అభిమానులు, రైతులపై విరుచుకుపడింది. రహదారులను బారికెట్లతో మూసివేశారు. అయినా కూడా రైతులు గుట్టలు, పుట్టలు, కాలువలు, పొలాలు, తోటలను దాటుకుంటూ జగన్‌ను కలిసేందుకు వచ్చారు. ఇటువంటి అశేష జనవాహినిని చూసి కూటమి ప్రభుత్వానికి చెమటలు పట్టాయి.
..ఈ పర్యటన విజయవంతం అవ్వడంతో తట్టుకోలేక చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీన్, ఈటీవీలు మామిడి రైతులపై ఇష్టారీతిగా ద్వేషాన్ని, విషాన్ని కుమ్మరించాయి. రైతులను రౌడీలు, దోపిడీదారులు, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ పతాక శీర్షికల్లో రాతలు రాశారు. ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో 'బంగారుపాళెంలో దండుపాళ్యం' అంటూ వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ అభిమానులను, రైతులు అరాచకం సృష్టించడానికి ప్రయత్నించారంటూ ఒక విషపు కథనాన్ని అచ్చేశారు.
..అదే పత్రికలో జగన్ పర్యటనకు అసలు జనాలే రాలేదంటూ మరో ఏడుపుగొట్టు కథనాని రాశారు. హెలిప్యాడ్ వద్దకు మూడువేల మంది జనం తోసుకువచ్చారంటూ అదే పచ్చ పత్రిక ఆంధ్రజ్యోతి మరో కథనం రాసింది. ఇలా ఏ రాస్తున్నారో కనీస స్పృహ కూడా లేకుండా ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలను ప్రచురించారు.
గిట్టుబాటు రేటు ఇస్తే రైతులు రోడ్డుపై పంట పారేస్తారా?
.. బంగారుపాళెంకు వచ్చింది రైతులే కాదు, ఎవరో రైతులకు చెందిన మామిడి కాయలను రోడ్డుపైన పారేశారంటూ ఇదే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసింది. వైయస్ జగన్ వస్తున్నారని కాదు, కనీసం కోత ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడం, ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి వేచిఉన్నా కొనుగోలు చేసేవారు లేక, మామిడి కాయలు కుళ్ళిపోతుండటంతో కడుపుమండిన రైతులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు మామిడి కాయలను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయిన ఘటనలు అనేక ఉన్నాయి. రైతులను ఆదుకోవడంతో, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవ్వడం వల్లే రైతులు తమ పంటను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయారు. దీనిని ఈనాడు పత్రిక తనకి నచ్చినట్లుగా వక్రీకరణ కథనాలు రాశారు. అలాగే రైతులు కానీ కొందరితో జగన్మోహన్‌రెడ్డి ఎందుకు వచ్చారో మాకు అర్థం కాలేదంటూ కూడా మరో విషపు కథనాన్ని రాశారు.
ఎల్లో మీడియాలో దుర్మార్గమైన థంబ్‌నెయిల్స్
.. వైఎస్ జగన్‌ను ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను అణువంతైనా తగ్గించలేరు. ఇక టీవీ5, ఏబీఎన్ చానెల్స్‌లో అయితే 'పోలీసులా...నరికేయండ్రా', 'డీఎస్సీని నరికేయండ్రా...' జగన్ పబ్లిక్‌గా దొరికాడు అంటూ థంబ్‌నెయిల్స్ పెట్టి మరీ దుర్మార్గమైన వీడియో కథనాలను ప్రసారం చేశారు.
..ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన నాయకుడు ఎక్కడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇలా కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆదేశాలు ఇస్తారా? 'పోలీసులపై రప్పా...రప్పా.. అంటూ రెచ్చిపోయిన జగన్', 'పరామర్శా... పొలిటికల్ ఈవెంటా?' 'పోలీసులను నరికేస్తారా...సర్కార్ ఏం చేస్తోంది' ఇలాంటి థంబ్ నెయిల్స్‌తో ఎల్లో మీడియా తన కడుపుమంటను, జగన్‌పై ఉన్న ధ్వేషాన్ని చాటుకునేందుకు సిగ్గూ,శరం లేకుండా దిగజారుడు కథనాలను ప్రచురించింది.
..గతంలో కశ్యప, భృగు, అత్రి, బృహస్పతి వంటి రుషులు లోకకళ్యాణం కోసం ప్రజలకు, పాలకులకు మంచిని బోధించేవారు. కానీ నేడు ఎల్లో మీడియా ఈ రుషులుగా భావించుకుని చంద్రబాబుకు తప్పుడు సలహాలు, విషపు కథనాలను ప్రచారం చేస్తూ అశాంతిని ఎలా రగిలించవచ్చో బోధిస్తున్నాయి. అలాగే ఈ ఎల్లో మీడియాకు టీడీపీ, జనసేన వారంతా సత్పురుషులు, వేదపండితులుగా కనిపిస్తున్నారు. వీరి నుంచి మాత్రమే ప్రజలు ఆశీస్సులను పొందాలని ఈ ఎల్లో మీడియా రుషులు చెబుతున్నారు. మిగిలిన వారంతా వారికి రాక్షసులతో సమానం.
కూటమి ప్రభుత్వ సూచనల మేరకే పోలీస్ కేసులు
..కూటమి ప్రభుత్వ నిర్భందాలు బద్దలు కొడుతూ రైతులు వైఎస్ జగన్ రాకను స్వాగతించారు. ఈ రైతులను మేం తీసుకురాలేదు, జన సమీకరణ అసలే చేయలేదు. పోలీసులు చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారమే పర్యటన సాగినా కూడా మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. రైతులు తమ మామిడి పంటను రోడ్డుపైన పారేస్తే, దానికి కూడా వైఎస్ జగన్ కారణమని పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారు.
..వైఎస్ జగన్‌పై కక్షసాధించాలనే తలంపుతోనే ఇలా చేస్తున్నారు. చివరికి వైఎస్ జగన్‌ను కలిసేందుకు వస్తే రౌడీషీట్లు కూడా తెరుస్తామని కూడా బెదిరించారు. మామిడి రైతులను కలుసుకునేందుకు వైయస్ జగన్ వస్తున్నారని తెలియగానే చంద్రబాబు హుటాహుటిన పల్ప్ ఫ్యాక్టరీ యజమానులుతో సమావేశం నిర్వహించారు. కేజీ రూ.6 కి కొనుగోలు చేయాల్సిందేనని ఒత్తిడి చేశారు. ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుందని ప్రకటించింది.
..అప్పటి వరకు బయట ఉన్న వందల లారీలకు స్పీడ్‌గా టోకెన్లు జారీ చేసింది. ఇవ్వన్నీ వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసిన తరువాత చేసినవే. గత ఏడాది వైఎస్ జగన్ హయాంలో మామిడికి మద్దతుధర కేజీకి రూ.29 రూపాయలు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో వస్తున్న ధర రూ.2 మాత్రమే. పొరుగురాష్ట్రం కర్ణాటకలో రెండున్నల లక్షల టన్నుల మామిడిని కేజీ రూ.16కి కొనుగోలు చేస్తామని కేంద్రాన్ని ఒప్పించుకోగలిగితే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అలా చేయలేక పోయారు? గిట్టుబాటు ధర కోసం ప్రశ్నించే పొగాకు, మిర్చి, ధాన్యం రైతులు కూడా ఈ ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వ దృష్టిలో సంఘ విద్రోహులేనా?
ఆఖరి అరగంట తరువాత జగన్‌కు భద్రతను లేకుండా చేశారు
..వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఆఖరి అరగంట వరకు సెక్యూరిటీని టైట్ చేసి, తరువాత భద్రతను ఎందుకు పూర్తిగా వదిలేశారు. అంటే వైఎస్ జగన్‌ను ఏమైనా చేయాలనే కుట్ర దీనిలో దాగుందా? ఎక్కడా వైఎస్ జగన్‌కు పోలీస్ రక్షణ లేకుండా చేసేశారు. జెడ్‌ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకుడి విషయంలో ఇలాగేనా చేసేది? రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉంటే, మార్కెట్ యార్డ్‌లో మూడు వందల మంది పోలీసులను మోహరింపచేశారు. కానీ ఆఖరి క్షణంలో ఆయన పక్కన ఎవరూ లేకుండా పోవడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది.