
సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి ప్రభుత్వం మామిడి రైతులతో చలగాటం ఆడుతుందని ఆరోపించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరులో కుమార్ అనే రైతును ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. బిన్ లాడెన్‌పై అమెరికా దాడిచేసినట్లు.. మారుమూల గ్రామంలో ఉన్న రైతును కూటమి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు. రైతుల కోసం వైఎస్ జగన్ తప్పకుండా వస్తారు.. వారిని కలిసి కష్టాలను తెలుసుకుంటారు అని తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల కోసమే బంగారుపాల్యం గ్రామానికి వైఎస్ జగన్ వస్తున్నారు. అందుకే కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు. జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం.. అందుకే రైతులను రాకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క వైఎస్సార్‌సీపీ నాయకులను భయపెడుతున్నారు. జనసేన, టీడీపీ వారు జగన్ పర్యటన రద్దు అయిందని అంటున్నారు. జగన్ రావడం.. రైతులను కలవడం ఖాయం.
కర్ణాటకలో మామిడికి ప్రభుత్వం మంచి ధర కల్పించింది. కానీ, చిత్తూరులో కుమార్ అనే రైతు నష్టాలకు భరించలేక, చెట్లు నరికేశాడు. దానికి ఫారెస్టు అధికారులు.. కుమార్‌ను నా ఇబ్బందులకు గురి చేశారు. అటవీశాఖ పవన్ కళ్యాణ్ అధీనంలో ఉంది. ఓ మామిడి రైతును ఎర్ర చందనం స్మాగ్లర్ గా చూపించారు. తన తోటలో తోతాపురి మామిడి కుళ్లిపోయే పరిస్థితి వచ్చింది. మామిడి రైతులతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతుంది. వైఎస్సార్‌సీపీ నాయకులు నిజాలు చెబితే తట్టుకోలేకపోతున్నారు.
వైఎస్ జగన్ పర్యటనపై నిర్బంధాలను విధించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ప్రజా సముద్రాన్ని ఎవరూ అడ్డుకోలేరు. వైఎస్ జగన్ రాష్ట్రంలోనే అత్యధిక, అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. జగన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టే పద్దతి మారాలి. హెలికాప్టర్ అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరాము’ అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ మాటలను మేము పట్టించుకోము. ఎవరో చెప్పారు. నేను లేస్తే మనిషి కాదని బెదించేవాడంటా.. ప్రజలు కూడా అతనికి భయపడేవారు.. వాస్తవానికి అతనికి కాళ్లే లేవు.. పవన్ కళ్యాణ్ మాటలు కూడా అలా ఉంటాయ్.. వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటూ ఎద్దేవా చేశారు.