PM Modi: టార్గెట్ 400.. అసలు సాధ్యమేనా?? | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ ఛరిష్మా: టార్గెట్ 400.. అసలు సాధ్యమేనా??

Published Mon, Feb 19 2024 8:39 AM

Behara Sreenivas Analysis On Pm Modi 400 Plus NDA Target - Sakshi

డబ్బులు ఊరికే రావు....
తళతళా మెరిసే గుండుతో టీవిలో కనబడినప్పుడల్లా ఊదరగొడుతూ ఉంటాడు ఓ పెద్దాయన... 
వాస్తవమే కదా మరి.. 
దీన్నే రాజకీయ భాషలో చెప్పాల్సి వస్తే...
అధికార పీఠం కూడా ఊరికే దక్కదు..
దశాబ్ద కాలంగా  దేశాన్నిఏలుతున్న ఎన్డీయే కూటమికి మాత్రం ఈ సూత్రం వర్తించదనే చెప్పొచ్చు.
మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అధికారం అవలీలగానే దక్కబోతోంది కాబట్టి! 
విపక్షాల బలహీనతే ఎన్డీయే కు ఇప్పుడు పెద్ద బలం. అదే అధికారాన్ని మరోమారు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించబోతోంది. 

2014 కు ముందు పదేళ్లు నిరాటంకంగా పాలించిన యూపీఏ కూటమి స్వయంకృత చేష్టలు ఆ పార్టీని అప్పట్లో అధికారానికి దూరం చేశాయి. ఫలితంగా ఎన్డీయే కూటమి కేంద్రంలో కొలువు తీరింది.. ఆనాటి నుంచీ నానాటికీ బలపడుతూ.. విపక్ష పార్టీలకు అందనంత ఎత్తుకు ఎదిగి పోయింది. . రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా మరోమారు హస్తినలో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీయే కూటమికి ఈసారి విజయం నల్లేరుపై  నడకే కావొచ్చు కానీ... తన ప్రాబల్యాన్ని ఈమేరకు పెంచుకుంటుంది అన్నదే ప్రధాన ప్రశ్న.  

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తాను పార్టీ అధ్యక్షునిగా ఉన్న కాలంలో, 400 పైచిలుకు సీట్లు 50 శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులతో తరచూ అంటూ ఉండేవారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే... ఈసారి ఎన్నికల్లో ఆ లక్ష్య సాధన కష్టమేమీ కాబోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  ఆ మధ్య ఇండియా టీవీ  సిఎన్ఎక్స్ చేపట్టిన ఒక సర్వే ప్రకారం 61 శాతం ప్రజానీకం మళ్ళీ మోదీ నే ప్రధానిగా చూడాలి అనుకుంటున్నామని చెప్పగా.. రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపింది మాత్రం కేవలం 21 శాతం మందే కావడం గమనార్హం.  . 

బ్రిటన్ కు చెందిన ‘ది గార్డియన్‘ పత్రిక తాజాగా ఒక విశ్లేషణ వెలువరిస్తూ.. కేంద్రంలో ఉన్నబలహీన ప్రతిపక్షమే  ప్రస్తుత అధికార పక్షాన్ని హ్యాట్రిక్ దిశగా నడిపించడం ఖాయమని అంచనా వేసింది. తదనుగుణంగానే ఇటీవలి రెండు సంఘటనలు  ఈ అంచనాల్ని మరింత పెంచాయి.అందులో ఒకటి అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠాపన కాగా... రెండోది మిత్రునిగా మారిన ’ప్రియమైన శత్రువు’ నితీష్ కుమార్ ఎన్డీయే తీర్థం పుచ్చుకోవడం.  

మోదీ హవా 
ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆ రాష్ట్రం భూకంపం తాకిడికి అతలాకుతలమై ఆర్ధిక వ్యవస్థ చితికిపోయి ఉంది. దీని తాలూకు దుష్పరిణామాల నుంచి ఆ రాష్ట్రాన్ని కేవలం మూడేళ్ళలో బయట పడేయడమే కాదు.. గుజరాత్ ను ఒక రోల్ మోడల్ గా  తీర్చిదిద్ది దేశ విదేశాల్లో ఆ రాష్ట్ర కీర్తి ఇనుమడిల్లేలా చేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. పెచ్చుమీరిన ద్రవ్యోల్బణం, వేళ్లూనుకున్న అవినీతి, నిరుద్యోగ భూతం, మౌలిక వసతుల లేమి, ఉగ్రవాదం, జాతీయ భద్రతా సవాళ్లు, ఆర్ధిక తిరోగమనం, కరెంటు ఖాతా లోటు రికార్డు స్థాయికి పెరిగిపోవడం, రూపాయి విలువ పడిపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు దిగ్బంధం చేసిన ఆ తరుణంలో 2014 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 31 శాతం ఓట్లతో 335 సీట్లు చేజిక్కించుకోవడం ద్వారా తొలిసారి ప్రధాని పగ్గాలు చేపట్టి తన సత్తా ఏమిటో నిరూపించుకోవడం చరిత్ర చెబుతున్న సత్యమే.  

బలాలు ఎన్ని ఉన్నప్పటికీ హిందీ బెల్ట్ సహకరించినట్లుగా తూర్పు, దక్షిణ భారతాల్లో బీజేపీ ఇప్పటికీ తగిన పట్టు మాత్రం సంపాదించలేక పోతోంది. అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రాల నుంచి ప్రమాదకర సంకేతాలేవీ లేనప్పటికీ ఈ రాష్ట్రాలపై ఫోకస్ పెడితే ఇక ఇప్పట్లో మోదీ టీం కు తిరుగే ఉండదు. రాబోయే ఎన్నికల్లో విజయ భేరి మోగించడం  ద్వారా ముచ్చటగా మూడోమారూ అధికార దండాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్న ఎన్డీయే కూటమి ప్రగతికి దోహదం చేసిన పరిణామాలు, సంస్కరించాల్సిన అంశాలను పరిశీలిద్దాం. 

అయోధ్య రామాలయం: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2019 లో బీజం పడింది. కోట్లాది హిందూ ఓటర్ల మనసులు గెలుచుకునేలా ఎప్పటికప్పుడు పావులు కదుపుతూ వచ్చిన బీజేపీ... తాజా ఎన్నికల వేళకు తనదైన శైలిలో అడుగులు వేయగలిగింది.  ఆగమేఘాల మీద పనులు ప్రారంభించి మొన్న జనవరి లో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన తో తన లక్ష్యాన్ని చేరుకోవడంలో కృతకృత్యమైంది. ఓటు బ్యాంకును పెంచే వాటిలో ఇదొక తాజా పరిణామం. 

పెట్టుబడులు  స్టాక్ మార్కెట్లు:  ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య రంగాలతో పాటు విదేశీ పొర్టుఫోలియో మదుపర్లపై విధిస్తున్న సర్ చార్జీని రద్దు చేయడం వంటి విదేశీ విధానాల్లోనూ అనుసరించిన విప్లవాత్మక విధానాలు మోదీ సర్కారు కీర్తి ప్రతిష్టలను దేశ విదేశాల్లో ఇనుమడింప జేశాయి. కేంద్రంలో స్థిరమైన సర్కారు ఏర్పడిందన్న భరోసా, మోదీ పై ఉన్న అచంచల విశ్వాసం.. విదేశీ మదుపరులకు స్థైర్యాన్నిచ్చాయి. దీంతో పెట్టుబడుల వరద మొదలైంది. మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. మధ్యలో కొవిడ్ పరిణామాలు వెనక్కి లాగినా.. అవన్నీ తాత్కాలికమేనని నిరూపిస్తూ ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిల్లో దూసుకెళ్తున్నాయి. 

 • మేక్ ఇన్ ఇండియా పేరిట దేశాన్ని గ్లోబల్ డిజైనింగ్ హబ్ గా తీర్చిదిద్దడం.  
 •  శిశు మరణాలను తగ్గించేందుకు, లింగ వివక్షని రూపు మాపేందుకు భేటీ  బచావో, భేటీ పడావో కార్యక్రమం. 
 • యువతలో నైపుణ్యాలను వెలికితీసే స్కిల్ ఇండియా, ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా డిజిటల్ ఇండియాలపై దృష్టి. 
 • మురికివాడల సంస్కృతికి చర్మ గీతం పాడే రీతిలో అర్హులైన పేద ప్రజానీకానికి ఇల్లు దక్కేలా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. 
 • యువ భారతంలో వ్యాపార నైపుణ్యాలను వెలికి తీసేందుకు, వారిని  భవిష్యత్ వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్ధేందుకు దోహదం చేసేలా అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రోత్సహించడం. తద్వారా నైపుణ్యాలకు  కొదువ లేక నిధుల లేమితో సతమతమయ్యే ఎంతోమంది నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చడం. 
 • నల్లధనంపై పోరాటం లో భాగంగా డీమోనిటైజేషన్ పేరిట పెద్ద నోట్ల ఉపసంహరణ  
 • ముస్లిం మహిళలకు షాదీ షాగున్ యోజనతో పాటు సౌభాగ్య, ప్రధాన మంత్రి ధన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ప్రధాన మంత్రి యువ యోజన, సంకల్ప్ సే సిద్ది, ఉడాన్, ఈశ్రమ పోర్టల్ ఆవిష్కరణ వంటి పథకాలు. 
 • ఆరోగ్య రంగంలో పేదలకు ఉపకరించేలా రూ. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా 
 • విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ విద్యా విధానాన్ని 2026 నాటికి దేశమంతటా అందుబాటులోకి తెచ్చేలా చేయడం.  
 • గత దశాబ్ద కాలంలో వివిధ ఎక్సప్రెస్ వే ల నిర్మాణం, రవాణా సదుపాయాలకు దూరంగా ఉండే గ్రామాలకు సైతం రైల్వే సదుపాయాలను కల్పించడం, వందే భారత్ రైళ్లు, చిన్నపట్టణాలు, నగరాల్లో విమానాశ్రయాల నిర్మాణం.   
 • విద్యుత్ వెలుగులకు నోచుకోని గ్రామాలకు కరెంట్ సదుపాయాలూ అందించడం.  
 • సమాజంలోని  బడుగు, బలహీన వర్గాల ఖాతాల్లో నేరుగా సొమ్ములను బదిలీ చేసే జన్ ధన్ యోజన పథకం.
 • చిన్న వర్తకులు, వ్యాపారస్థులకు ప్రయోజనం చేకూరేలా డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు శ్రీకారం చుడుతూ యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడం.

సమస్యలూ ఉన్నాయి..
అవినీతి  నల్లధనం: కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి, లంచగొండితనం వేళ్ళూనుకుపోయాయి. ఇది అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేది కానే కాదు. అవినీతి, కుంభకోణాలకు ఆమడదూరం ఉంటామని చెప్పే పార్టీ లో వాటితో నేరుగానో, పరోక్షంగానో ప్రమేయం ఉన్న కొందరు రాజకీయ వేత్తలు ఉండటం ఓ పెద్ద మచ్చ. నల్ల ధనం నిరోధం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగానే ఉంది. బ్లాక్ మనీ నిరోధం దిశగా పెద్ద నోట్ల రద్దు వంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వేసిన అడుగులు నామమాత్రమే. 

ధరలు  రైతులు:  ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందంటూ రిజర్వు బ్యాంకు చెబుతున్నప్పటికీ ధరలు మాత్రం దిగివచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. సామాన్యుడి నడ్డి విరుగుతూనే ఉంది. దళారీ వ్యవస్థ నిర్మూలనలోనూ చర్యలు నామమాత్రమే. పంజాబ్, హర్యానా రైతులు దేశ రాజధానిలో లబోదిబో మంటూ నిరసనలకు దిగుతున్నా వారి సమస్యల పరిష్కారం దిశగా సరైన అడుగులు పడటం లేదు.

డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటికీ పరిష్కారం కాని విషయాలు చాలానే ఉన్నాయి. చెల్లింపులు చేసినప్పుడు ఎదురయ్యే అవాంఛనీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది.

వందే భారత్ రైళ్లు ఓ గొప్ప విజయమని చెప్పుకునే దేశంలో.. ఇప్పటికీ గబ్బుకొట్టే రైళ్లు, అక్కరకు రాని స్టేషన్లు, సరైన పహారా వ్యవస్థ లేని రైల్వే క్రాసింగ్ లు వంటి సమస్యలతో రైల్వే రంగం కొట్టుమిట్టాడుతోంది.

జనాభా విస్తరణతో నగరాలుగా మారుతున్న పట్టణాలు, పట్టణాలుగా రూపు సంతరించుకుంటున్న మండల స్థాయి గ్రామాల్లో మౌలిక వసతుల లేమి ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఈనేపథ్యంలో స్మార్ట్ నగరాల నిర్మాణం ఎప్పటికి, ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. 

పాలకులు మారొచ్చు గాక.. ప్రభుత్వాలు కొత్త రూపు సంతరించుకోవచ్చు గాక.. కాలానుగుణ మార్పుల్లో భాగంగా కొత్త విధానాలతో ప్రజలకు ఉపయుక్తమయ్యే రీతిలో కార్యాచరణ ఉన్నప్పడే అసలైన అడుగు పడినట్లు.  ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో మూడో స్థానం దిశగా భారతావని అడుగులు వేస్తోందని మోదీ సర్కారు చెబుతోంది. వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేననే సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. కొలువు దీరబోయే కొత్త ప్రభుత్వం అఖండ భారతంలో వెలుగులు విరబూయించాలంటే ప్రజల తలరాతలు మార్చగలగాలి. లేకుంటే అంకెలన్నీ హంగూ ఆర్భాటాలతో కాగితాలపై కనిపించే మెరుపు తీగలు గానే మిగిలిపోతాయి. అలా జరగదనే భావిద్దాం. ఈసారి బృహత్తర లక్ష్యాలతో ఎన్డీయే సర్కారు ముందుకు సాగాలని, స్వర్ణ భారతం ఆవిష్కృతమవ్వాలని ఆశిద్దాం. 

✍️బెహరా శ్రీనివాస రావు
సీనియర్ పాత్రికేయులు 

Advertisement
 
Advertisement
 
Advertisement