UP Assembly Election 2022: నువ్కొకటి కొడితే... నేను రెండేస్తా!

UP Assembly Elections 2022: Political Scenario in UP Assembly Elections - Sakshi

సాక్షి విశ్లేషణ

ఇప్పుడు సరిగ్గా.. ఇదే పంథాలో ఉత్తరప్రదేశ్‌ రాజకీయ యవనికపై టిట్‌ ఫర్‌ టాట్‌ క్రీడ రక్తికడుతోంది. అబ్బురపరిచే ఎత్తులతో సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. హిందుత్వ కార్డుతో ఓటర్లు సంఘటితం కాకుండా చూసుకుంటే సగం యుద్ధం గెలిచినట్లేనని భావించిన ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌... చాణక్యాన్ని ప్రదర్శించారు. కీలకమైన ఓబీసీ నేతలను లాగేశారు. తామేమి చేయకపోతే చేష్టలుడిగి చూస్తుండిపోయిందనేది ప్రజల్లోకి వెళుతుందని... దిక్కుతోచని స్థితిలోకి బీజేపీ వెళ్లిపోయిందని భావిస్తారని కమలదళం భయపడింది. ఎత్తుకు పైఎత్తుకు వేసింది. చిన్న కోడలు అపర్ణా యాదవ్‌ను లాగేయడం ద్వారా ములాయం సింగ్‌ ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ఈ రాజకీయ సమయంలో వ్యూహాలు పదునెక్కుతున్న వైనంపై ‘సాక్షి’ సవివర కథనం... 

మౌర్య ఇచ్చిన షాక్‌తో ‘మైండ్‌ బ్లాంక్‌’ 
ఇతర వెనుకబడిన వర్గాల్లో (ఓబీసీల్లో) బలమైన నాయకులైన మంత్రులు స్వామి ప్రసాద్‌ మౌర్య జనవరి 12న, దారాసింగ్‌ చౌహాన్‌ 13న మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కలకలం రేగింది. రోజుకో మంత్రి, ఒక ఎమ్మెల్యే చొప్పున పార్టీని వీడిపోవడంతో బీజేపీకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తం ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. కాషాయపార్టీ తేరుకునే లోగానే... ఓబీసీలను బీజేపీ అవమానిస్తోందని... అందుకే వారంతా సమాజ్‌వాదీ పార్టీలోకి క్యూ కడుతున్నారనే సందేశం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. 

ములాయం ఇంట్లోనే ముసలం 
నష్టనివారణకు దిగిన బీజేపీ దిమ్మతిరిగేలా కొట్టాలని భావించి అసంతృప్తితో ఉన్న అఖిలేశ్‌ మరదలు అపర్ణా యాదవ్‌కు (సవతి సోదరుడు ప్రతీక్‌ యాదవ్‌ భార్య) గాలం వేసింది. సొంత మనిషినే ఆపలేకపోతే అఖిలేశ్‌ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు. సరిగ్గా బీజేపీ అక్కడే కొట్టి లక్ష్యాన్ని సాధించింది. 

మైండ్‌గేమ్‌ 
కీలక ఓబీసీ మంత్రులు పార్టీని వీడి వెళ్లిపోవడంతో తూర్పు యూపీలో నష్టం తప్పదని భావించిన బీజేపీ దీన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్‌ నుంచి బరిలోకి దింపింది. తర్వాత బీజేపీ కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ ఎన్నికల బరిలోకి దిగడానికి భయపడుతున్నారని ప్రతిరోజూ వల్లెవేస్తూ ఎస్పీ చీఫ్‌ను పిరికివాడిగా చూపే ప్రయత్నం చేశారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అఖిలేశ్‌ తాను మెయిన్‌పురి నుంచి పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు. నిజానికి వీరిద్దరూ పోటీచేసింది... కంచుకోటలైన సొంత నియోజకవర్గాల నుంచే. నిజానికి ఈ విషయంలో ఏటికి ఎదురీదే గుండె ధైర్యాన్ని ప్రదర్శించి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. ఒకప్పటి తన కుడిభుజం సువేందు అధికారికి కంచుకోటగా మారిన ‘నందిగ్రామ్‌’ నుంచి పోటీచేస్తానని ప్రకటించి నివ్వెరపరిచారు. తాను నందిగ్రామ్‌ బరిలో ఉంటే సువేందు అధికారి సొంత నియోజకవర్గానికి బాగా సమయం కేటాయించాల్సి వస్తుందని, ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి తిరగలేరనేది దీదీ ఎత్తు. తాను ఓడిపోయినా... మమత వ్యూహం మాత్రం బ్రహ్మాడంగా వర్క్‌ అవుట్‌ అయి దీదీ హ్యాట్రిక్‌ కొట్టారు. 

కొట్టారు.. తీసుకున్నాం. మాకూ టైమొస్తుంది.. మేమూ కొడతాం
– 2017లో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిశాక... చంద్రబాబు సర్కారు కుట్రపూరిత వేధింపులపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సంధించిన ఈ వాగ్భాణం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ‘ఇది కదా... సిసలైన పోరాటయోధుడి గుండెధైర్యం’ అనుకున్నారు జనం. 

ప్రియాంక నినాదం తుస్సుమనేలా.. 
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కొడిగట్టిన కాంగ్రెస్‌ కనీసం గౌరవప్రద స్థితిలో నిలిపితే.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సానుకూలత రావడానికి ఉపయోగపడుతుందని యూపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి ప్రియాంకా గాంధీ ‘లడకీ హూ... లడ్‌ సక్తీ హూ (ఆడబిడ్డను... పొరాడగలను)’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. తద్వారా ‘మేమెందుకు పురుషులతో సమానం కాదు. మాకేం తక్కువ’ని నేటితరం యువతుల్లో బలంగా నాటుకుపోయిన భావజాలాన్ని ప్రేరేపించారు. బాగా జనంలోకి వెళ్లిపోవడంతో ఈ నినాదంతో కాంగ్రెస్‌ యూపీ నలుమూలగా నిర్వహించిన మారథాన్‌లకు యువతుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రియాంక ఎత్తుగడ ఫలించింది. దాంతో ఆమె 40 శాతం అసెంబ్లీ టిక్కెట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించి.. చేతల్లో చూపడం ద్వారా మహిళా ఎజెండాను మరిం త ముందుకు తీసుకెళ్లారు.

చదవండి: (కరోనానే పెద్ద పరీక్ష!)

ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రియాంక  పోరాట సన్నద్ధంగా ఉన్న ముగ్గురు యువతుల ఫోటోతో కూడిన హోర్డింగ్‌లు, పోస్టర్ల ను యూపీ వ్యాప్తంగా విస్తృతంగా అతికిం చారు. ఈ ముగ్గురిని లీడ్‌ చేస్తూ మధ్యలో ఉన్న యువతి పేరు ప్రియాంకా మౌర్య, వృత్తిరీత్యా డాక్టర్‌. మంచి వక్త. లింగ సమానత్వం కోసం ప్రియాంకా గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లిందని ప్రియాం క మౌర్య. ఆమె స్వభావం, ఆహార్యం దీనికి బాగా ఉపకరించాయి. దాంతో ఈ ఉద్యమానికి ప్రియాంక మౌర్య బ్రాండ్‌ అంబాసిడర్‌గా, పర్యాయపదంగా మారారు. సరిగ్గా బీజేపీ ఇక్కడే గురిచూసి కొట్టింది. 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తే మహిళల్లో కాంగ్రెస్‌కు మంచి సానుకూలత వస్తుందని, అసలే ఒకవైపు ఎస్పీ– రాష్ట్రీయ లోక్‌దళ్‌ పొత్తులో తమ హిందూత్వ కార్డు నిర్వీర్యమైన పోయిన పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ ఎత్తుగడ తమకు భారీ నష్టం కలుగుజేస్తుందని భయపడ్డ బీజేపీ మాస్టర్‌ గేమ్‌ ఆడింది.

‘అడపిల్లను... పోరాడగలను’ అనే నినాదానికి బ్రాండ్‌ అం బాసిడర్‌గా ఉన్న ప్రియాంక మౌర్యను లాగేస్తే కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టొచ్చని భావించి అమలులో పెట్టేసింది. మహిళలకు 40 టిక్కెట్లు ఇచ్చామని కాంగ్రెస్‌ గొప్పలు చెప్పుకుంటోందని.. చేతల విషయానికి వచ్చే సరికి కష్టజీవి ప్రియాంక మౌర్యకే మొండి చేయి చూపిందనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపింది. ఇప్పుడిక ప్రియాంకా గాంధీ మహిళలకు ఇచ్చే టికెట్లు 50 శాతానికి పెంచినా, ఈ విషయాన్ని ఎన్నికల ర్యాలీల్లో 500 సార్లు చెప్పినా జనం నమ్మరు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
– నేషనల్‌ డెస్క్, సాక్షి   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top