UP Assembly Election 2022: గాంధీల అడ్డాలో కాంగ్రెస్‌కు కష్టమే!

UP Assembly Election 2022: Raibareli Versus Varanasi Congress And BJP - Sakshi

రెండు ప్రాంతాల్లో విభిన్న పరిస్థితులు 

కన్నెత్తి చూడని రాహుల్‌..

ప్రియాంక ఒంటరి పోరు  

వారణాసిలో మళ్లీ బీజేపీ హవాయే!  

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల మహా సంగ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, గాంధీ కుటుంబం దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో బీజేపీ, కాంగ్రెస్‌ విజయావకాశాలపై సర్వత్రా  ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాయ్‌బరేలీలో నాలుగో విడతలో భాగంగా ఫిబ్రవరి 23న పోలింగ్‌ పూర్తవగా వారణాసిలో ఆరు, ఏడు విడతల్లో మార్చి 3, 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ రెండుచోట్లా భిన్న రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోదీ ప్రాతినిధ్యంలో గత ఎనిమిదేళ్లలో వారణాసి అనూహ్యమైన అభివృద్ధి సాధిస్తే అంతకుముందు పదేళ్ల యూపీఏ హయాంలో రాయబరేలిలో సాధించిన అభివృద్ధి శూన్యమనే అభిప్రా యం స్థానికుల్లో బాగా ఉంది. అభివృద్ధి నినాదం తోనే వారణాసిలో మళ్లీ పట్టు నిలుపుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రధాని మరో రెండు విడతలు ఇక్కడ ప్రచారం చేయనున్నారు. 

కాంగ్రెస్‌కు కష్టకాలం  
గత బుధవారం పోలింగ్‌ ముగిసిన రాయ్‌బరేలీలో ప్రస్తుతమున్న రెండు అసెంబ్లీ సీట్లను కూడా కాంగ్రెస్‌ కోల్పోవచ్చంటున్నారు. ‘‘గాంధీ కుటుంబంపై మాకిప్పటికీ ప్రేమాభిమానాలున్నాయి. కానీ ఆ కుటుంబం రాయ్‌బరేలీ ప్రజలకు చేసిందేమీ లేదు. 2004 నుంచి పదేళ్లు అధికారంలో ఉండి కూడా మాకు కనీస సదుపాయాలు కల్పించలేకపోయారు’ అని కిషన్‌ సింగ్‌ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడి ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌ ఈసారి ఒక్కటైనా గెలిచే పరిస్థితి లేదని రాయబరేలీ బస్టాండ్‌ సమీపంలో 50 ఏళ్లుగా టీ దుకాణం నడుపుస్తున్న మొహియుద్దీన్‌ అన్నాడు.

ఇదంతా కాంగ్రెస్‌ స్వయంకృతమేనని అభిప్రాయపడ్డాడు. ‘ఇందిరాగాంధీ పోటీ చేసిన నాటి నుంచి మొన్నటి 2017 అసెంబ్లీ ఎన్నికల దాకా కాంగ్రెస్‌కే ఓటేస్తూ వచ్చా. ఈసారి మాత్రం విధిలేక వేరే పార్టీకి వేశా’’ అని చెప్పాడు. 70 ఏళ్లుగా పార్టీనే గెలిపిస్తూ వచ్చిన ఇక్కడి 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఈసారి కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. యువ గాంధీలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం స్థానికంగా కనిపిస్తోంది. ‘కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఆ కుటుంబం మమ్మల్ని చూసింది. ఇక మేము మా పంథా మార్చుకోక తప్పలేదు’ అని కిరాణ వ్యాపారి రాంగోపాల్‌ గుప్తా  చెప్పారు.  

పోటీ నామమాత్రమే  
రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోని రాయ్‌బరేలీ సదర్, బచ్రావన్, హర్‌చంద్‌పూర్, సరేనీ, ఉంచహర్‌ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామమాత్రంగానే పోటీలో ఉన్నారు. యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను పూర్తిగా నెత్తికెత్తుకున్న ప్రియాంక గాంధీ గత వారం పోలింగ్‌కు ముందు ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా పెద్దగా లాభించలేదని పోలింగ్‌ అనంతర పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇకపై తాను ఇక్కడి నుంచి పోటీ చేసేదీ లేనిదీ భవిష్యత్తు నిర్ణయిస్తుందన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చాయి.

రాయ్‌బరేలీ ప్రజలతో తమ అనుబంధం కొనసాగుతుందన్న భరోసా కల్పించలేకపోయారన్న భావన వ్యక్తమైంది. ఇక్కడ బీజేపీ నుంచి అమిత్‌షా, ఎస్పీ నుంచి అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు ప్రచారానికి రాగా రాహుల్‌గాంధీ మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు. ‘ఇందిర హయాంలో రాయ్‌బరేలీ వాసులు ఢిల్లీ వెళ్లినా బాగా చూసుకునేవారు. సోనియా వచ్చాక పరిస్థితులు మారాయి. రాహుల్, ప్రియాంకల తరం వచ్చేసరికి మమ్మల్ని పట్టించుకునే వారే లేకుండా పోయారు’ అని రఘునాథ్‌ మిశ్రా అనే స్థానిక వ్యాపారి అన్నాడు. రాయ్‌బరేలీ సదర్‌ పార్టీ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదితీసింగ్‌పై స్థానిక కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 

కాశీ.. మోదీ సహవాసి 
ఈశాన్య యూపీ పరిధిలోని వారణాసి లోక్‌సభ స్థానంలో 8 అసెంబ్లీ సీట్లున్నాయి. ఆరింట బీజేపీ, రెండింట్లో మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. వీటిల్లో మళ్లీ బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2 నుంచి 5 దాకా ఇక్కడ ప్రచారం చేయనున్నారు. వారణాసి పరిధిలో ఆయన ప్రచారం ఈశాన్య యూపీలోని 111 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతుందని  అంచనా.

రాయ్‌బరేలి (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రతినిధులు
కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top