న్యాయమైన వాటాను.. శాసించే స్థాయికి!

UP Assembly Election 2022: Fair Share To The Level Of Governing - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణులు.. ఠాకూర్‌ (రాజ్‌పుత్‌)లు, వైశ్యులు... 19 శాతం ఉన్న ముస్లింలు... 9–10 శాతం దాకా ఉన్న యాదవులు... తరతరాలుగా వీరిదే అధికారం... వీరి మాటే వేదం... వీరు చెప్పిందే చట్టం. 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ 2017లో యూపీలో కొత్త ప్రయోగం చేసింది. మోదీ చరిష్మా, 25 శాతం దాకా ఉన్న అగ్రకులాల ఓట్లలో అత్యధికం సాధించడం, యాదవేతర ఇతర వెనుకబడిన (ఓబీసీల్లో) వర్గాల్లో ... మరోవైపు ముస్లిం ఓట్లలో సాధ్యమైనంత చీలిక తేవడం ద్వారా బీజేపీ 39.67 శాతం ఓట్లతో ఏకంగా 312 సీట్లు సాధించింది. తిరుగులేని మెజారిటీతో యూపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 19.3 శాతం ఉన్న ముస్లిం ఓట్లలో చీలిక రావడం, అవి ఇతర లౌకిక పార్టీల మధ్య పంపిణీ కావడం , 10 శాతం యాదవ ఓట్లలో సింహభాగం తమకే పడ్డా... అధికార పీఠాన్ని అందుకోవాలంటే ఇవి సరిపోవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు తేలిగ్గానే అర్థమైంది. అందుకే ఈసారి ఆయన ఇతర ఓబీసీ నేతలకు గాలం వేస్తూ... ఆయా వర్గాలను మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు.

యూపీలో మొత్తం 42 నుంచి 45 శాతం దాకా ఓబీసీలు ఉంటే... ఇందులో  యాదవులు పోను నికరంగా 32–35 శాతం ఇతర ఓబీసీలు ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీలు ఇప్పుడిక్కడే తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఆయా కులాలకు ప్రాతినిధ్యంవహించే చిన్నాచితకా పార్టీలకు అర్హతకంటే ఎక్కువ సీట్లే ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నాయి.  

ఎంత అసంతృప్తి ఉన్నా... తగ్గేది కొంతే!
బ్రాహ్మణ/ సామాజికవర్గంలో బీజేపీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని. కాషాయపార్టీ పట్ల వారు గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చినా సరే... కనీసం 8 శాతం మంది బ్రాహ్మణులు ఇప్పటికీ బీజేపీతోనే ఉంటారని సీనియర్‌ జర్నలిస్టు బ్రిజేష్‌ శుక్లా అభిప్రాయపడ్డారు. ఠాకూర్‌లు యూపీ జనాభాలో 7 శాతం ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వయంగా ఠాకూర్‌ వర్గానికి చెందిన వారు కాబట్టి వీరిలో కనీసం 6 శాతం ఓట్లు బీజేపీకే పడవచ్చు. వ్యాపారం ప్రధాన వృత్తిగా ఉండే వైశ్యులు (యూపీ జనాభాలో ఐదు శాతం) తరాలుగా కమలదళంతోనే ఉంటూ వస్తున్నారు. ఇక ఎస్పీ విషయానికి వస్తే ముస్లింలో అత్యధిక ఓట్లు, యాదవుల ఓట్లు కలిపితే... దాదాపు 28 శాతం సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటోంది. బీజేపీ ఇంచుమించు అలాగే ఉన్నా... కనీసపక్షం ఇరుపక్షాల ఓట్లు 25 శాతానికి తగ్గడం లేదు. అంటే అధికార పీఠాన్ని అందుకోవాలంటే ఎంతలేదన్నా... అదనంగా మరో 10 శాతం ఓట్లు రావాలి.  

రాజ్‌భర్‌లు– 4 శాతం 
రాజ్‌భర్‌లు యూపీ జనాభాలో 4 శాతం ఉంటారు. ప్రధానంగా తూర్పు యూపీలో కేంద్రీకృతమై ఉన్నారు. వీళ్లు 11వ శతాబ్దానికి చెందిన రాజు సుహైల్‌దేవ్‌ను కొలుస్తారు. మహ్మద్‌ గజనీ మేనల్లుడిని ఓడించిన ఘన చరిత్ర రాజా సుహైల్‌దేవ్‌కు ఉంది. 2002లో çసుహైల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌పార్టీని (ఎస్‌బీఎస్‌పీ)ని స్థాపించిన ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ తమ సామాజికవర్గానికి ఏకైక నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేశారు. 2017లో బీజేపీతో పొత్తుపెట్టుకొని ఎనిమిది స్థానాల్లో పోటీచేసి నాలుగింటిలో గెలుపొందారు. మంత్రిగా యోగి టీమ్‌లో చేరగా... తర్వాత విభేదాలు వచ్చి బీజేపీకి కటీఫ్‌ చెప్పారు. ఐదారు చిన్నాచితకా పార్టీలను కూడగట్టి అఖిలేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు.  

వారికి పూలన్‌దేవి ఆరాధ్యం 
నిషాద్‌లు ప్రధానంగా మత్స్యకారులు. యూపీ జనాభాలో నాలుగు శాతం ఉంటారు. నదీ తీరాల్లోని 26 జిల్లాల్లో ప్రభావవంతంగా ఉంటారు. బందిపోటు రాణి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన పూలన్‌దేవి వీరికి ఐకాన్‌. 2022 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిషాద్‌ పార్టీని బుజ్జగించిన బీజేపీ ఆ పార్టీకి 15 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. 

లోధీలు (3.5 శాతం)  
లోధీలు యూపీలో నాలుగో అతిపెద్ద ఓబీసీ కమ్యూనిటీ. 16 జిల్లాల్లో ప్రభావం చూపగలిగే స్థితిలో ఉన్నారు. ప్రస్తుత యూపీ అసెంబ్లీలో 20–22 మంది లోధీ ఎమ్మెల్యేలు (అత్యధికులు బీజేపీ నుంచే) ఉన్నారు. లోధీలో శిఖరగ్ర సమానుడైన యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ ఇటీవల చనిపోవడం బీజేపీకి అతిపెద్ద లోటుగా పరిణమించింది.  

మౌర్యులు/ కుష్వాహాలు (6 శాతం) 
మౌర్యులు, కుష్వాహాలు కలిపి ఈసారి ఎస్పీని అధికారంలోకి తేవాలని కంకణం కట్టుకున్నారనేది స్థానిక పార్టీ మహాన్‌దళ్‌ నినాదం. తూర్పు యూపీలోని గాజీపూర్, వారణాసి, బలియా, కుశీనగర్, జౌన్‌పూర్‌ జిల్లాల్లో మౌర్యులు కేంద్రీకృతమై ఉన్నారు. కుష్వాహాలు ఇటావా, మెయిన్‌పురి, జలౌన్, ఝాన్సీల్లో ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి కుల ఆధారిత ఈ చిన్ని రాజకీయ పార్టీలను బుజ్జగించి విజయవంతంగా వారి ఓట్లను మళ్లించుకోగలిగితేనే ప్రధాన రాజకీయ పార్టీలకు విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పొచ్చు. 

కీలెరిగి వాత! 
ఇతర వెనుకబడిన వర్గాలు... ప్రధాన పార్టీలకు ఉన్న ఈ అవసరాన్ని బాగా గుర్తించాయి. తమ ఓట్లు దక్కాలంటే అడిగినన్ని సీట్లు, మంత్రి పదువులు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్లు చేస్తూ మరీ ప్రధాన రాజకీయపక్షాల మెడలు వంచుతున్నాయి. యాదవుల తర్వాత కుర్మీలు యూపీలో రెండో అతిపెద్ద ఓబీసీ వర్గం. జనాభాలో ఐదు శాతం ఉంటారు. 16 జిల్లాల్లో దాదాపు 12 శాతం కుర్మీల జనాభా కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఆయా జిల్లాల్లో వీరి మద్దతే కీలకం అవుతోంది. కుర్మీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనుప్రియా పటేల్‌ నేతృత్వంలోని అప్నాదళ్‌ (ఎస్‌)తోనే ఈ సామాజికవర్గం నిలబడుతోంది. అప్నాదళ్‌ 2014 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ హవా నడిచిన కాలంలో కుర్మీలకు చెందిన బేణి ప్రసాద్‌ వర్మకు పెద్దపీట వేయడంతో ద్వారా ఈ సామాజికవర్గంలో ఎస్పీకి మంచి పట్టు సంపాదించగలిగారు. అయితే తర్వాతి కాలంలో బేణి ప్రసాద్‌ వర్మ మరణంతో కుర్మీల్లో ఎస్పీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.  
– నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top