ఏపీ గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు | AP TDP Jana Sena BJP Alliance MLAs Key Meeting Updates, Who Will Get Ministers Post | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఏర్పాటు కోసం ఏపీ గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు

Published Tue, Jun 11 2024 8:10 AM

AP TDP Jana Sena BJP Alliance MLAs Key Meeting Updates

ఏపీ కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు 

ప్రతిపాదించిన పవన్‌ కల్యాణ్‌, సమర్థించిన దగ్గుబాటి పురందేశ్వరి

టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేల మద్ధతుతో ఎన్నిక ఏకగ్రీవం

గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి

రేపే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం

విజయవాడ గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవం

హాజరు కానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా, పలువురు సీఎంలు

 

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం ముగిశాక నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నకున్నట్లు గవర్నర్‌ నజీర్‌కు లేఖ ఇచ్చారు. 

గవర్నర్‌ను కలిసిన వాళ్లలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి పురందేశ్వరి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన సంఖ్యా బలం తమకు ఉందని, చంద్రబాబును తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని  ఈ సందర్భంగా వాళ్లు ఆయన్ని కోరారు. ఆ ఎమ్మెల్యేల సంతకాల లేఖను పరిశీలించిన గవర్నర్‌ నజీర్‌.. ప్రభుత్వ ఏర్పాటునకు సాయంత్రంలోగా ఆహ్వానిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. 

అంతకు ముందు.. విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి నేతగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఎన్డీయే కూటమి నేతగా.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి ఆమోదం తెలిపారు.  ఆవెంటనే మూడు పార్టీల ఎమ్మెల్యేలు సమ్మతి తెలపడంతో సభా నాయకుడిగా చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.  

కూటమి అద్భుత విజయం ఏపీ రాష్ట్రం సాధించిన విజయం. సమిష్టిగా పోరాడి అద్భుత విజయం సాధించాం. ఎన్డీయే కూటమి విజయం దేశవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. అద్భుతమైన మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కక్ష సాధింపులు.. వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. ఏపీ ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబుకి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రబాబు అనుభవజ్ఞుడే కాదు.. ధైర్యశాలి కూడా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం. ప్రజలకు ఎన్నో హామీలిచ్చాం. వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
:: పవన్‌ కల్యాణ్‌  

ఏపీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించాం. ఇంతటి ఘన విజయం సాధిస్తామని ఎవరూ ఊహించలేదు. 
::బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలు ఏకం అయ్యాయి. అధిక స్ట్రైక్‌ రేట్‌తో విజయం సాధించాం. ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు. ఇది అన్‌స్టాపబుల్‌ విజయం.  ఏపీలో ఘన విజయంతో ఢిల్లీలో గౌరవం పెరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 
::చంద్రబాబు నాయుడు 

శాసనసభ పక్ష నేతల ఎంపిక
కూటమి మీటింగ్‌ కంటే ముందే.. మంగళగిరి జనసేన ఆఫీస్‌లో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పవన్‌ను జనసేన శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు ఈ పేరును ప్రతిపాదించగా.. అందుకు ఎమ్మె‍ల్యేలంతా ఆమోదం తెలిపారు. ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం అయ్యారు. కానీ, శాసన సభా పక్ష నేత ఎంపిక నిర్ణయం అధిష్టానానికే వదిలేసినట్లు సమాచారం. దీంతో బీజేఎల్పీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

రేపే ప్రమాణం.. స్టేట్‌ గెస్ట్‌గా చిరు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణం చేయనున్నారు.  విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. మరోవైపు ప్రమాణ స్వీకారానికి స్టేట్‌ గెస్ట్‌గా నటుడు మెగాస్టార్‌ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు చంద్రబాబు. దీంతో ఈ సాయంత్రమే చిరు విజయవాడకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు రాం చరణ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. 

మంత్రి వర్గంపై ఉత్కంఠ
మరోవైపు.. రేపు(బుధవారం) ఉదయం ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం. టీడీపీ కోటాతోపాటు జనసేన, బీజేపీ నుంచి పేర్లతో కేబినెట్‌ కూర్పు ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ కూర్పు కోసం మూడు పార్టీల నేతలు సుదీర్ఘ కసరత్తులే చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయోననే ఉత్కంఠ ఆయా పార్టీ శ్రేణుల్లో నెలకొంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement