పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం: మంత్రి కురసాల

AP: Minister Kurasala Kannababu Reaction On ZPTC MPTCElection Results - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీలో పరిషత్‌ ఎన్నికలు చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయాల పరంపరం కొనసాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి కురుసాల కన్నబాబు తెలిపారు. గత స్థానిక ఎన్నికలు చూసినా, ఇప్పుటి ఫలితాలు చూసినా అదే ట్రెండ్‌ కొనసాగుతోందన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో 80 శాతం వస్తే ఇప్పుడు అంతకు మించి రానున్నాయన్నారు. ఒక నాయకుడి నిబద్ధతకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు ఏ ముహూర్తాన ఆ మాట అన్నాడో గానీ ఆ మాటలు అక్షర సత్యం అవుతున్నాయని తెలిపారు.
చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌: జిల్లాల వారీగా ఫలితాలు
 
అయితే ఈ రోజు తాము బహిష్కరించాం కాబట్టే వైఎస్సార్సీపీ గెలిచిందని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అప్పుడు టీడీపీ అన్ని ఎన్నికల్లో పాల్గొన్నారని, బీఫామ్ ఇచ్చారని, ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు బహిష్కరణ అంటే ప్రజలు నమ్మరని అన్నారు. మున్సిపాలిటీల్లో ఒక్క తాడిపత్రి తప్ప అన్ని చోట్లా వైఎస్సార్సీపీ గెలిచిందని చెప్పారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు సీఎం జగన్‌ వెనుక ఉన్నారన్నారు. మీ వెనుక మేమున్నాం.. ముందుకెళ్లండి అంటూ సీఎంకు భరోసా ఇచ్చారని తెలిపారు. ఆ రోజు మూడు కరోనా కేసులు మాత్రమే ఉంటే ప్రభుత్వానికి కూడా సమాచారం లేకుండా నిలిపేశారని, ఎన్నికలు జరపొద్దని అడ్డుపడి, ఆ తర్వాత ఫలితాలను ఆపేశారన్నారు. ఇప్పుడు వీళ్లు ఎన్ని చేసినా ప్రజలు సీఎం జగన్‌ వెనకున్నామని స్పష్టం చేశారని పేర్కొన్నారు.
చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌: జిల్లాల వారీగా ఫలితాలు

‘ఇవి గాలివాటం ఎన్నికలు కాదు.. ఒక ముఖ్యమంత్రికి ప్రజలు వెన్నుదన్నుగా నిలిచిన ఎన్నికలు. ఏ రోజు స్థానిక ఎన్నికల్లో టీడీపీ ప్రజామోదాన్ని పొందినది లేదు. ఇప్పటికీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అర్థం చెప్పింది వైఎస్ జగన్. ఓటమికి కారణాలు వెతుక్కోవద్దు. కొత్త బాష్యాలు చెప్పొద్దు. పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం. ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలి. 

మీరు అమితంగా ప్రేమిస్తున్న అమరావతిలోనే మీకు మద్దతు లభించలేదు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఒకే రకమైన ఫలితాలు వస్తున్నాయి. 13కి 13 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంటాం. ఓడిపోయిన ప్రతిసారీ ఎన్నికలకు వెళదాం రండి అంటున్నారు. ఇవన్నీ ఎన్నికలు కాదా...? సిగ్గులేదా.. ఓటమిని ఒప్పుకోండి. మేము లేస్తే మా అంత వస్తాదులు లేరని తొడగొట్టడం మానండి.’ అని మంత్రి కురసాల హితవు పలికారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top