మహిళలపై నేరాల్లో.. ఎవరినీ ఉపేక్షించబోం

AP Home Minister Sucharitha Respond on Vijayawada Girl Suicide Case - Sakshi

గుంటూరు రూరల్‌: విజయవాడలో టీడీపీ నాయకుడు వినోద్‌ జైన్‌ లైంగిక వేధింపులకు బలైన 14 ఏళ్ల చిన్నారి ఘటన చాలా బాధాకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనలో నిందితుడైన టీడీపీ నాయకుడు వినోద్‌ జైన్‌ను వెంటనే అరెస్టు చేశామన్నారు. సీఎం జగన్‌ పోలీసు శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ఏ కేసులో అయినా పారదర్శకంగా విచారణ జరపి, నేరస్తులకు శిక్షపడేలా చేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ముఖ్యమంత్రి పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు.

మహిళలపై నేరాల ఘటనల్లో ఎవరినీ ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు. బాలిక బలవన్మరణం కేసులో 54 ఏళ్ల వ్యక్తి ఇలా దారుణంగా ప్రవర్తించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాలిక తన బాధను బయటకు చెప్పుకోలేక ఎంత మనోవేదనకు గురైందో, ఆమె సూసైడ్‌ నోట్‌ను చూస్తేనే అర్థమవుతుందన్నారు. బాలిక తన బాధను బయటికి చెప్పుకోలేక తనువు చాలించడం అత్యంత బాధాకరమన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసమే ఈ ప్రభుత్వం దిశ యాప్‌ తీసుకువచ్చిందని చెప్పారు.

‘దిశ’ యాప్‌ను ఉపయోగించండి 
ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు అమ్మాయిలు వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని ఆమె తెలిపారు. తల్లిదండ్రులతో చెప్పుకోలేని సంఘటనలు ఏమైనా ఉంటే కనీసం దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. అంతేకానీ.. భయాందోళనకు గురై ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే దాదాపు 2 లక్షల మందికి పైగా సెక్సువల్‌ అఫెండర్స్‌పై నిఘా పెట్టి, వారి కదలికలను గుర్తించేందుకు వారిని జియో ట్యాగింగ్‌ చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా లైంగిక వేధింపుల కేసుల్లో కేవలం 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నేరస్తులను శిక్షిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో వారు, వీరు అనే తేడాలేకుండా, ఏ పార్టీ వారు నేరం చేసినా వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. వ్యభిచార ఘటనలో 46 మంది అరెస్టు గుంటూరు జిల్లా మేడికొండూరులో వ్యభిచార ఘటనలో పోలీసులు వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరిపారన్నారు. మొత్తం 46 మందిని అరెస్టు చేసినట్లు మంత్రి సుచరిత వెల్లడించారు. ఈ కేసులో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు ఉన్నాడని టీడీపీ వాళ్లు ఆరోపణలు చేసినప్పటికీ అతనిని కూడా అరెస్టుచేశామన్నారు.  

చదవండి: టీడీపీ శ్రేణులు నారీ దీక్ష వినోద్‌ జైన్‌ ఇంటి ముందు చేయాలి: ఆర్కే రోజా

వినోద్‌ జైన్‌పై కఠిన చర్యలు 
విజయవాడ బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడు వినోద్‌ జైన్‌పై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్‌ 306, 354, 354, 354, 509, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నానన్నారు.

ఆ ఘటనల్లో ఇప్పటికీ టీడీపీ సమాధానం లేదు
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మార్వో వనజాక్షిని ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కొట్టిన కేసులో ఏం చర్యలు తీసుకున్నారని సుచరిత ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదన్నారు. టీడీపీ హయాంలోనే జరిగిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అలాగే, నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి రిషితేశ్వరి కేసులో ఏం న్యాయం చేశారంటే టీడీపీ నుంచి ఇప్పటికీ సమాధానం లేదన్నారు. తాజాగా.. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలపై నారా లోకేష్‌ పీఏ లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటనపై కూడా సమాధానంలేదని సుచరిత చెప్పారు.  
చదవండి: పసి మనసుకు ఎందుకింత కష్టం.. లోపం తల్లిదండ్రులదా? చిన్నారులదా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top