పంజాబ్‌లో ఆప్‌ టెన్‌ పాయింట్‌ అజెండా

AAP Ten Points Agenda In Punjab - Sakshi

ఢిల్లీ అసెంబ్లీలో అధికార పీఠాన్ని వరుసగా రెండుసార్లు దక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఈసారి సర్దార్ల రాష్ట్రం పంజాబ్‌లోనూ పాగా వేయాలని తహతహలాడుతోంది. ఫిబ్రవరి 20న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టికరిపించి, జయకేతనం ఎగుర వేసేందుకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఆప్‌ నేతలు ఇంటింటి ప్రచారంలో తలమునకలయ్యారు. రైతు సంఘాలతో కూడిన ‘సంయుక్త సమాజ్‌ మోర్చా’తో పొత్తు పెట్టుకోవాలని ఆప్‌ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడమే ఇందుకు కారణం.

సంయుక్త సమాజ్‌ మోర్చా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగింది. ఈ మోర్చా తమ ఓట్లను చీల్చే అవకాశం ఉందని కేజ్రీవాల్‌ సైతం అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ విజయం తమదేనని ధీమాగా చెబుతున్నారు. పంజాబ్‌ ప్రజల మనసులను గెలుచుకొనేందుకు ఆమ్‌ ఆద్మీ ప్రధానంగా టెన్‌ పాయింట్‌ అజెండాను తెరపైకి తీసుకొచ్చింది. పంజాబ్‌లో సామాన్య ప్రజల భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. పంజాబ్‌ ఆప్‌ అధ్యక్షుడు భగవంత్‌ మాన్, ఇతర నాయకులు ప్రజల అభిప్రాయాలను సేకరించారు. వారు ఎలాంటి పాలన కోరుకుంటున్నారో గుర్తించారు. తమ నేతలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ఆప్‌ నాయకత్వం ‘పంజాబ్‌ మోడల్‌’ను సిద్ధం చేసింది. ఇందులో 10 పాయింట్లు ఉన్నాయని, ఇవన్నీ పంజాబ్‌ అభివృద్ధి కోసమేనని కేజ్రీవాల్‌ ఉద్ఘాటించారు. 

పంజాబ్‌ మోడల్‌ ఇదే..
పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు రౌండ్‌ ద క్లాక్‌(రోజంతా) ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. పెద్ద బెడదగా మారిపోయి, రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తున్న మాదక ద్రవ్యాల భరతం పడతామని పేర్కొంది. డ్రగ్స్‌ నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. యువత కోసం పెద్ద ఎత్తున ఉద్యోగావశాలు కల్పిస్తామని, విదేశాలకు వలస వెళ్లిన వారు సైతం వెనక్కి తిరిగి వచ్చేలా చేస్తామని కేజ్రీవాల్‌ చెప్పారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని నెలకొల్పుతామని అన్నారు. బాధిత, అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చడం తమ అజెండాలోని కీలక అంశమని చెప్పారు.

సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిని విడిచిపెట్టబోమని పేర్కొన్నారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన అవినీతిని అంతం చేస్తామని ప్రతిన బూనారు. పనుల కోసం ప్రజలు లంచాలివ్వాల్సిన అవసరం ఇక ఉండదని భరోసా కల్పించారు. పంజాబ్‌ మోడల్‌ కింద విద్యా, వైద్య రంగాలను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ తరహాలో 16,000 మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మోడల్‌ స్కూళ్లతోపాటు విద్యాసంస్థల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని తెలిపారు. రైతన్నల సమస్యలను పరిష్కరిస్తామని, ‘రైడ్‌రాజ్‌’ను నామరూపాల్లేకుండా చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వ్యాపారం, వాణిజ్యం పెరగడానికి, పరిశ్రమల స్థాపన కోసం పూర్తి అనుకూల వాతావరణం కల్పిస్తామని కేజ్రీవాల్‌ వివరించారు. 

షెడ్యూల్డ్‌ కులాలపై గురి
రాష్ట్ర జనాభాలో 32 శాతం ఉన్న షెడ్యూల్డ్‌ కులాల ఓట్లపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రధానంగా గురిపెట్టింది. ఆయా కులాలను మచ్చిక చేసుకుంటోంది. ఎస్సీ కులాల చిన్నారులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. పై చదువులకు వెళ్లేవారికి కోచింగ్‌ కోసం అవసరమైన ఫీజులను తామే భరిస్తామని తెలిపారు. ఇంజనీరింగ్, మెడికల్, సివిల్స్, రైల్వే తదితర పోటీ పరీక్షలకు శిక్షణ పొందితే ఆ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తే అందుకయ్యే వ్యయాన్ని సైతం ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ఎస్సీల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఉచితంగా చికిత్స చేయిస్తామని చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top