‘బీజేపీలో చేరితే రూ.20కోట్లు.. ఎమ్మెల్యేలను తీసుకెళ్తే రూ.25 కోట్లు’.. ఆప్‌ ఆరోపణలు

AAP Alleges BJP Offered Rs 20 Crore To Join 25 Crore To Get Others - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ కుంభకోణంపై మనీష్‌ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించిన క్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలోనే ఐదుగురు ఆప్‌ సీనియర్‌ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డబ్బులు, బెదిరింపులతో తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్ర ఏజెన్సీలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏవిధంగా ఉపయోగిస్తుందో ప్రస్తుత పరిస్థితులు అద్దపడుతున్నాయని పేర్కొన్నారు ఆప్‌ జాతీయ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌. 

‘ఢిల్లీ ఎమ్మెల్యేలను విడగొట్టే ప్రయత్నం మొదలైంది. మనీష్‌ సిసోడియాపై బీజేపీ చేసిన ‘షిండే’ ప్రయత్నం విఫలమైంది. పార్టీ మారి రూ.20 కోట్లు తీసుకోండి.. లేదా సిసోడియా మాదిరిగా సీబీఐ కేసులు ఎదుర్కోండి అని ఆప్‌ ఎమ్మెల్యేలను బెదిరించారు. ఎమ్మెల్యేలు అజయ్‌ దత్‌, సంజీవ్‌ ఝా, సోమ్‌నాథ్‌ భారతి, కుల్దీప్‌లకు బీజేపీ నేతలు ఈ ఆఫర్‌ ఇచ్చారు. పార్టీ మారితే ప్రతిఒక్కరికి రూ.20 కోట్లు ఇస్తామన్నారు. ఇతర ఎమ్మెల్యేలను తనతో తీసుకొస్తే రూ.25 కోట్లు ఆఫర్‌ చేశారు.’ అని పేర్కొన్నారు ఎంపీ సంజయ్‌ సింగ్‌. 

తమకు బీజేపీ నేతలు ఏవిధంగా ఆఫర్‌ ఇచ్చారనే అంశాన్ని విలేకరులతో చెప్పారు మిగిలిన నలుగురు ఆప్‌ ఎమ్మెల్యేలు. ‘సిసోడియాపై పెట్టిన కేసులు ఫేక్‌ ‍అని తమకు తెలుసునని, కానీ, ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సీనియర్‌ నేతలు నిర్ణయించారని బీజేపీ నేతలు మాతో చెప్పారు. ఆప్‌ నాయకులను తీసుకువచ్చే పనిని వారికి అప్పగించినట్లు తెలిపారు. ఎంత దూరమైనా వెళ్లి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొడతామని వెల్లడించారు.’ ‍అని ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ పేర్కొన్నారు. మరోవైపు.. ఆప్‌ ఎమ్మెల్యేలు, సిసోడియా.. ఆపరేషన్‌ లోటస్‌ను ఆపరేషన్‌ బోగస్‌గా మార్చారని ఎద్దేవా చేశారు సంజయ్‌ సింగ్‌.

ఇదీ చదవండి: బీజేపీ మాకు భయపడుతోంది :కేజ్రీవాల్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top