2022 UP Elections: సిట్టింగ్‌లకు నో ఛాన్స్‌.. సుమారు 150 మందికి అవకాశం లేదు !

2022 UP Elections: BJP to Deny Tickets to 150 Aspirants - Sakshi

అభ్యర్థుల ఎంపిక విషయంలో ఫార్ములా వర్కౌట్‌ చేస్తున్న బీజేపీ 

క్షేత్రస్థాయి అభిప్రాయాలు, నివేదికలే ప్రాతిపదిక 

గత నాలుగున్నరేళ్ళలో పనితీరే ప్రామాణికం 

వ్యాఖ్యలతో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన వారికి రాం.. రాం.. 

2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కమలదళం వ్యూహరచన 

సాక్షి, న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు, వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను కమలదళం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోభాగంగా క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న అభిప్రాయాలు, నివేదికల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు చేయాలని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ల పంపిణీ కోసం ఒక ఫార్ములాను రూపొందించింది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2022 అసెంబ్లీ  ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలతో సహా సుమారు 150 మంది అభ్యర్థులకు ఈసారి టికెట్‌ ఇవ్వకుండా ఉండేందుకు పార్టీ సిద్ధమవుతోంది. వీరిలో 2017 ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు ఉండనున్నారు. 

టార్గెట్‌ 350– క్షేత్రస్థాయిలో సర్వేలు.. 
వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో 403 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం 350 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వడపోత ద్వారా దశలవారీగా అభ్యర్థుల ఎంపిక చేయాలని నిర్ణయించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎంతో కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌పై తమ పట్టు నిలబెట్టుకోవడం వల్ల రాబోయే రెండు, మూడేళ్ళలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమ ప్రభావాన్ని కొనసాగించొచ్చని కమలదళం యోచిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక సర్వే నిర్వహిస్తున్నారు. అంతేగాక కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ జిల్లాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.  

చదవండి: (బీజేపీని ముక్కలు–ముక్కలు చేస్తాను)

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి గుడ్‌బై.. 
అంతేగాక పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, గత నాలుగున్నరేళ్ళుగా పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏమాత్రం చురుగ్గాలేని ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. అదే సమయంలో గత నాలుగున్నరేళ్ళలో తమ అనవసర, వివాదాస్పద ప్రకటనలు, వ్యాఖ్యలతో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఏర్పరిచిన ఎమ్మెల్యేలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించారు. వీరితో పాటు వయసురీత్యా 70 ఏళ్లు దాటిన, వివిధ రకాల తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ఎమ్మెల్యేలకు సైతం టికెట్లు ఇవ్వరాదని పార్టీ అధిష్టానం ఒక ఫార్ములా రూపొందించింది. ముఖ్యంగా స్థానిక ప్రజలు, కార్యకర్తలు, పార్టీ కార్యవర్గ సభ్యులు కోపంగా ఉన్న ఎమ్మెల్యేలకు బదులుగా, పార్టీలో నిబద్ధతగా పనిచేస్తున్న ఇతర నాయకులు, కొత్తవారికి అవకాశం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. దీంతోపాటు వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మె ల్యేలకు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇవ్వరాదని పార్టీ పెద్దలు విశ్వసిస్తున్నారు.   చదవండి: (అన్న ఐపీఎస్, తమ్ముడు ఐఏఎస్‌)

ఒక్కో సీటుకి ఇద్దరు లేదా ముగ్గురితో ప్యానెల్‌.. 
అంతేగాక అభ్యర్థుల ఎంపిక కోసం జిల్లా అధ్యక్షులు వారి పరిధిలోని సీట్లలో ఒక్కొక్క స్థానానికి మూడు పేర్ల చొప్పున ప్యానెల్‌ను, ప్రాంతీయ బృందాల నుంచి మరో మూడు పేర్ల ప్యానెల్‌ను తీసుకుంటారు. వీటిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ రాధా మోహన్‌ సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, డాక్టర్‌ దినేష్‌ శర్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ కమిటీ ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చిన ప్యానెల్‌లను పరిశీలించి  మూడు పేర్లతో ఉన్న ఒక ప్యానెల్‌ను సిద్ధం చేస్తుంది. ఈ కమిటీ తరపున, ప్రతి అసెంబ్లీ స్థానానికి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో రెండు నుంచి మూడు పేర్లతో ఉన్న ప్యానెల్‌ను తయారుచేసి పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పంపిస్తారు. అయితే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయం కూడా కీలకంగా మారనుంది. సంఘ్‌ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, సహ సర్‌కార్యవాహ కృష్ణగోపాల్‌లు గత కొంతకాలంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు, 2022 అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top