
సాక్షి, అమరావతి: తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆదివారం సా.5 గంటలతో ముగిసింది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో మొదటి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు, 32,504 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. మొత్తం నామినేషన్ల సంఖ్యపై స్పష్టత రానందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కార్యాలయం ఆ సంఖ్యను వెల్లడించలేదు. ఇక సోమవారం ఉ.8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) కార్యక్రమం ప్రారంభమవుతుంది.
దీనిపై అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 2వ తేదీ సా.5 గంటల వరకు సంబంధిత ఆర్డీవోల వద్ద తెలియజేయవచ్చు. వాటిపై 3న తుది నిర్ణయం ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4వ తేదీ మ.3 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. ఆ వెంటనే ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల వివరాలతోపాటు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎక్కడికక్కడ సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉన్నచోట ఫిబ్రవరి 9న ఉ.6.30 నుంచి మ.3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సా.4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
నామినేషన్లు ఆశాజనకం: నిమ్మగడ్డ
మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు వేయడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం నామినేషన్లు ఆశాజనకంగా ఉన్నాయన్నారు.