పెద్దపల్లి: మహిళా సంఘాలను స్వయం సమృద్ధి వైపు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయడానికే పరిమితం కాకుండా మహిళా సంఘాలు సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకునేలా వివిధ పరిశ్రమలు, వ్యాపార సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన జిల్లా మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. ఈనెల మూడో తేదీన ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
రూ.1.15 కోట్ల పెట్టుబడి
మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్‌కు సుమారు రూ.1.15 కోట్ల పెట్టుబడి పెట్టారు. బంక్ ఏర్పాటుకు కలెక్టర్ కోయ హర్ష ఆధ్వర్యంలో 8 గుంటల ప్రభుత్వ భూమి కేటాయించారు. నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. బంక్ కార్యకలాపాలు ప్రారంభమైతే మహిళా సంఘాలకు నిరంతర ఆదాయం సమకూరుతుంది. అంతేకాదు.. సంఘ సభ్యులకు ఉపాధి అవకాశాలు కూడా మరిన్ని పెరుగుతాయని భావిస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల నుంచి పెట్రోల్ బంక్ వరకు..
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, రైస్ మిల్లులు, మినీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ వస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించింది. అదేతరహాలో తాజాగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ద్వారా మహిళా సంఘాలకు స్వయం ఉపాధితోపాటు వ్యాపార నిర్వహణలోనూ అవకాశం కల్పిస్తోంది. రాజీవ్ రహదారి పక్కన బంక్ ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులకు సౌకర్యంగా ఉండటంతోపాటు సంఘాలకు ఆదాయ వనరుగా మారుతుందని అధికారులు చెబుతున్నా రు. తద్వారా జిల్లాలోని మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధిస్తాయని పేర్కొంటున్నారు.
మహిళా సంఘాల మరో ముందడుగు
భూపతిపూర్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటు
నేడు ప్రారంభించేందుకు యంత్రాంగం చర్యలు
ఆదాయ మార్గాల విస్తరణకు నాంది
ఇప్పటివరకు పొదుపు, రుణ కార్యకలాపాలకే పరిమితమైన మహిళా సంఘాలు.. తాజాగా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోకి అడుగుపెడుతున్నాయి. పెట్రోల్ బంక్ వంటి వాణిజ్య సంస్థల నిర్వహణ ద్వారా మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు బాటలు పడుతున్నాయి.
విజయవంతం చేయండి
పెట్రోల్ బంక్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వ విప్ విజయరమణారావుతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌కుమార్ తదితరులు హాజరవుతారని చైతన్య జ్యోతి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఆలేటి జ్యోతి తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.


