కోల్‌సిటీ: గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జనరల్ మెడిసిన్ ఓపీ సేవలు నిలిపివేశారు. సేవలు నిలిపివేస్తున్నామని అధికారులు ఉత్తర్వులు సర్క్యులర్ జారీ చేసినా.. ప్రజలకు ముందుగా తెలియజేయలేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లు, బంధువులు అసహనంతో వెనుదిరగాల్సి వచ్చింది. అత్యవసర సేవలతోపాటు గర్భిణులు, చిన్నారుల ఓపీ సేవలను యథావిధిగా కొనసాగించారు. బంధువులతోపాటు ఇన్‌పేషెంట్లను పరామర్శించేందుకు వచ్చిన వారిని కూడా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. కొందరు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆర్‌ఎంవోలు అరుణ, అప్పారావు పరిస్థితిని చక్కదిద్దారు.
ముందస్తు సమాచారం లేక..
జనరల్ ఓపీ సేవలు నిలిపివేస్తున్న విషయాన్ని ఆస్పత్రి వర్గాలు అంతర్గతంగా సర్క్యులర్ ద్వారా తెలియజేసినా.. పేషెంట్లకు ముందుగా సమాచారం అందించేలా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి వద్ద ఎక్కడా నోటీసు బోర్డు ఏర్పాటు చేయకపోవడంతోపాటు, పత్రిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.
సెలవు రోజుల్లో ఓపీ ఉండదు
అక్టోబర్ 2, జనవరి 26 వంటి సెలవు రోజుల్లో జనరల్ ఓపీ సేవలను నిలిపివేస్తున్నామని ఆర్‌ఎంవో రేణుక స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలు నిరంతరం కొనసాగిస్తామని డాక్టర్ తెలిపారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్లను చూసేందుకు పాస్‌లు జారీచేస్తున్నామని, పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తున్నట్లు రేణుక వివరించారు.
ముందస్తు సమాచారం లేక పేషెంట్ల అవస్థలు
ఇన్‌పేషెంట్ల బంధువులను లోనికి అనుమతించని వైనం
పాస్ విధానాన్ని అమలు చేస్తున్న ఆస్పత్రి అధికారులు


