ఫెర్టిలైజర్‌సిటీ: ఖాజీపల్లి పోచమ్మ ఆలయంలో పోతురాజు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. మేకల శ్రీధర్ విగ్రహాన్ని బహూకరించారు. భక్తులు అమ్మవారికి, పోతురాజు స్వామికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేకల కుమార్, మేకల శ్రీనివాస్, మేకల కొమురయ్య, భక్తులు పాల్గొన్నారు.
క్రీడలకు ఎన్టీపీసీ పెద్దపీట
జ్యోతినగర్: ఎన్టీపీసీ క్రీడలకు పెద్దపీట వేస్తోందని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చంన్ కుమార్ సామంత అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎన్టీపీసీలోని మహా త్మాగాంధీ క్రీడా మైదానంలో ఆదివారం ఎన్టీపీసీ స్పోర్ట్స్ కౌన్సిల్ 3కే రన్ నిర్వహించింది. ఈడీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతోపాటు ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 3కే రన్ నిర్వహించామని తెలిపారు. అనంతరం ప్రశంసాపత్రాలను అందించారు. ఉద్యోగులు, మ హిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఫెన్సింగ్ పనులు అడ్డగింత
రామగిరి: రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మేడిపల్లిలో చేపట్టిన ఇండస్ట్రియల్ పార్క్ ఫెన్సింగ్ పనులను నిర్వాసితులు ఆదివారం అడ్డుకున్నారు. తమకు పరిహారం వచ్చి న తర్వాతనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇండస్ట్రియల్ పార్క్‌ను పరిశీలించిన సందర్భంగా.. వారం రోజుల్లో సమస్య పరిష్కారిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు కొండు లక్ష్మణ్, బాద్రపు శ్రీనివాస్, ఊనగొండ మధుకర్, కొవ్వూరి సురేశ్, పానగంటి ప్రశాంత్, మండల శంకర్, మండల శ్రీనివాస్, బర్ల వెంకన్న, జక్కుల శివ, ఎరుకల బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో అన్నపూజ
ఎలిగేడు: స్థానిక భవానీరామలింగేశ్వర ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అన్నపూజ, రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకుడు చెగ్యామ దయాకర్ ఆచార్య ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈకార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కూలిన గనిపైకప్పు
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11గనిలోని మొదటి సీమ్‌లో ఆదివారం సెకండ్ షిప్టులో పైకప్పు కూలింది. గనిలోని వన్ సీమ్‌లో కంటిన్యూస్ మైనర్–1 యంత్రం పనిచేస్తున్న ప్రాంతంలో పైకప్పు కూలడంతో యంత్రం అందులో ఇరుక్కుంది. పుల్లర్ యంత్రం ద్వారా దానిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈప్రాంతంలో పైకప్పు కూలడం సహజంగా జరిగే ప్రక్రియ అని, పుల్లర్ ద్వారా ఆ యంత్రాన్ని బయటకు తీస్తున్నామని, ఈసంఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని గని ఏజెంట్ చిలుక శ్రీనివాస్ వివరించారు. దీంతో కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


