● కేసు నమోదు చేసిన పోలీసులు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులో బుధవారం రాత్రి మద్యం మత్తులో కొందరు యువకులు ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఎస్సై సిరిసిల్ల అశోక్, బాధితులు తెలిపిన వివరాలు. సారంపల్లి శివారులో బైక్‌లపై అతివేగంగా వెళ్తున్న యువకులను మెల్లగా వెళ్లండి..అని సూచించడంతో రెచ్చిపోయారు. ఆటోకు అడ్డుగా బైక్‌లను పెట్టి దేశాయిపల్లికి చెందిన కంకణాల రాజు, అతని భార్య లత, కుమారుడు అక్షిత్, తమ్ముడు తిరుపతి, మరదలు చామంతిలపై దాడి చేశారు. వీరికి మరికొందరు తోడయ్యారు. ఈ దాడిని గమనించిన స్థానికులు ప్రశాంత్, నరేష్‌లు అడ్డుకునేందుకు రాగా వారిపై కూడా దాడి చేశారు. అనంతరం మరికొందరు స్థానికులు కిషన్, నవీన్, అశోక్ అడ్డుకోవడంతో యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. క్షతగాత్రులు సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. బాధితుల ఫిర్యాదుతో దాడికి పాల్పడిన వేముల ఆదిత్య, రంగు భరత్, రంగు తిలక్, ఎర్ర హరికుమార్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


