పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాదు.. పొరుగు జిల్లాలైన కరీంగనర్, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్దపల్లి సర్కారు దవాఖానాకే వస్తున్నారు. రాష్ట్రస్థాయిలో 4 అవార్డులు అత్యుత్తమ అవార్డులు దక్కడం ఇక్కడి వైద్యసేవలకు నిదర్శనం. అవార్డులను ప్రధానం చేసిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సేవలతీరుపై ఆరా తీశారు. విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో రోజూవారీ వైద్యసేవల నివేదికను నెలరోజులుగా సీఎంవోకు పంపిస్తున్నారు.
పెరిగిన ఔట్‌పేషెంట్లు
జిల్లా ఆస్పత్రికి రోజూ 800 నుంచి 1,000 మందరకు ఔట్‌పేషెంట్లు వస్తున్నారు. ఆన్‌లైన్ పద్ధతిలోనే ఓపీ టోకెన్ జారీచేస్తున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది.
రికార్డుస్థాయిలో డెలివరీలు
ఆస్పత్రిలో రికార్డుస్థాయిలో ప్రసవాలు జరిగాయి. గర్భం దాల్చినప్పటి నుంచి 102 వాహనంలో గర్భిణులను ఏఎన్‌ఎం వెంట తీసుకొచ్చి వైద్యపరీక్షలు చేసి మందులు ఇప్పించి, మళ్లీ ఇళ్లకు చేర్చుతున్నారు. గర్భిణులకు అవసరమయ్యే శ్రీటిఫాశ్రీ స్కానింగ్ యంత్రం ద్వారా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఇలా రెండేళ్లలో 5,067 ప్రసవాలు జరిగాయి.
నవజాతశిశువు కోసం ప్రత్యేకవార్డు..
కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యసేవలను మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. మందులు, వైద్యపరికరాల కోసం నిధులు కేటాయించారు. నవజాత శిశువుల జబ్బులను నయం చేసుకునేందుకు కుటుంబీకులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో జిల్లా ఆస్పత్రిలోనే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సిబ్బందిని నియమించి మూడు నెలలపాటు కరీంనగర్‌లో శిక్షణ ఇప్పించారు. ఇప్పటివరకు 991 మంది నవజాత శిశువులకు పలురకాల వైద్యసేవలను అందించారు. వారిలో 180 మంది శిశువులకు సీ –పాప్ (కంటిన్యూస్ పాసిటివ్ ఏర్‌వే ఫ్రెజర్) వైద్యం కూడా అందించారు. శ్వాస సంబంధమైన, బరువుతక్కువగా, పుట్టుకతో వచ్చే లోపాలతో ఉన్నవారికి సైతం వైద్యం అందింది.
ఆధునిక పరికరాలతో కంటి వైద్యం
కంటి వైద్యపరీక్షల కోసం అధునాతనమైన యంత్రాలను వినియోగిస్తున్నారు. సులువుగా శస్త్రచికిత్సలు పెద్దపల్లిలోనే జరుగుతుండడంతో వేలాదిమంది కంటి వైద్యం కోసం వస్తున్నారు. లేజర్ ట్రీట్‌మెంట్ కూడా అందిస్తున్నారు. కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్లద్దాలను కూడా ఉచితంగానే అందిస్తున్నారు. ఇప్పటివరకు 8వేల మందికి సేవలందించారు.
పేషెంట్లకు వరం డయాలసిస్ కేంద్రం
కిడ్ని సంబంధిత వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ అవసరమైన వారు గతంలో కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. జిల్లా ఆస్పత్రిలోనే ఐదు యూనిట్లతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా డయాలసిస్ పేషంట్లకు దూరభారం తప్పింది. ఇక్కడ 48 మంది పేషెంట్లు చికిత్సపొందుతున్నారు. రోజూ 20మందికి డయాలసిస్ చేస్తున్నారు. ఈ కేంద్రానికి ఓ టెక్నీషియన్ అవసరముంది.
ఆర్థో, ఈఎన్‌టీ, స్కిన్ ఇలా.. అనేక సేవలు..
ఆర్దోపెడిక్, చెవి, ముక్కు, గొంతు, దంత, ఫిజియోథెరపీ, యురాలజీ, నెనటాలజీ, లేజర్ సర్జరీ ఫర్ పైల్స్ లాంటి అనేక సేవలను ప్రభుత్వ వైద్యులు అందిస్తున్నారు.
టీహబ్‌లోనే ల్యాబ్ పరీక్షలు..
పేషెంట్ వ్యాధి నిర్ధారణ కోసం లాబొరేటరీ టెస్టులను కూడా ఉచితంగానే చేయిస్తున్నారు. ఇదేఆవరణలోని టీహబ్ కేంద్రంలో 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. రెండుగంటల్లోపే ఫలితాలు వస్తున్నాయి. డిజిటల్ ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, 2డీఎకో లాంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.


