రామగుండం: కార్మిక క్షేత్రంలో కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రామగుండంలో ప్రతిపాదిత వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి పది నెలల క్రితం టెండరు ప్రక్రియ ప్రారంభించినా ఇంకా ముందుకు సాగకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దాదాపు పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుపై నాన్చుడు ధోరణి అవలబిస్తున్నాయి.
3.30 ఎకరాలు.. రూ.150.08 కోట్లు..
రామగుండం పట్టణంలోని ఈఎస్‌ఐ డిస్పెన్షరీ స్థలం 3.30 ఎకరాలు. కేటాయించిన బడ్జెట్ రూ.150.08 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 2018, రాష్ట్ర ప్రభుత్వం 2025లో ఆస్పత్రి నిర్మాణానికి అనుమతి మంజూరు చేశాయి. బహుళ అంతస్తులతో మల్టీస్పెషాలిటీ వైద్యసేవలు అందించాలని నిర్ణయించాయి. అదేవిధంగ 2016 జూన్ 6న అప్పటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రూ.వంద కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2018 డిసెంబర్ 25న ఈఎస్‌ఐ రీజినల్ డైరెక్టర్ల బృందం సందర్శించింది. పదివేల మంది కార్మికులకు ఆరు పడకలు, 30వేల మందికి 30 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. 2022 జూన్ 17న ఈఎస్‌ఐ ప్రధాన కార్యాలయంలో రామగుండంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో నిర్మించాలని నిర్ణయించారు. 2018 గణాంకాల ప్రకారం 54,260 మంది కార్మికులు ఈఎస్‌ఐలో నమోదైనటు్‌ల్ పేర్కొన్నారు. 2022 జూలై 5న ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుపై నిపుణుల బృందం ఎస్టీ కాలనీ సమీపంలోని గురుకులం పక్కనున్న ప్రభుత్వ స్థల పరిశీలన, ఇతరత్రా అంశాలపై క్షేత్ర పరిశీలన చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆస్పత్రికి సదరు స్థలం అనుకూలంగా లేదని తేల్చారు. 2023 జనవరి 12న అప్పటి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అప్పటి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి ఈఎస్‌ఐ ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలని కోరారు. 2023 డిసెంబర్ 12న జరిగిన ఈఎస్‌ఐ కార్పొరేషన్ సమావేశంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. 2025 జనవరి 8న వంద పడకలతో ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది.


