పునాదుల్లోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పునాదుల్లోనే అభివృద్ధి

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

పెద్దపల్లిరూరల్‌: ‘పెద్ద’పల్లి జెడ్పీ కార్యాలయంతో సాధారణ ప్రజలకు పెద్దగా పనేమీ ఉండదు. కానీ, ఇప్పటికీ పాలకమండలిలేదు. అందుకే కాబోలు రూ.1.60 కోట్ల అంచనాతో పక్కా భవన నిర్మాణం చేపట్టి దాదాపు ఏడాది కావొస్తున్నా పనులు పునాదులు దాటడంలేదు. నిర్మాణంలో వేగం పెంచేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు ఎందుకు చొరవ చూపడం లేదనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

అరకొరసౌకర్యాలతో అవస్థలు

జెడ్పీ కార్యాలయాన్ని తొలుత తహసీల్దార్‌ ఆఫీసు ఆవరణలోని ఓ భవనంలో ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్మన్‌, సీఈవోల కోసం ప్రత్యేక చాంబర్లు కేటాయించారు. కార్యాలయ వ్యవహారాలను సమీప రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించారు. తరచూ జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశాలను ఎన్టీపీసీలోని మిలీనియంహాల్‌తోపాటు ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాళ్లలో నిర్వహిస్తూ వచ్చారు. జెడ్పీటీసీల పదవీకాలం ముగిశాక జెడ్పీ చైర్మన్‌, సీఈవో చాంబర్లను ఖాళీ చేయించి అందులోకి తహసీల్దార్‌ కార్యాలయాన్ని తరలించారు. జెడ్పీ చైర్మన్‌ ఎలాగూ లేరు. సీఈవోకు అదే రిటైర్డ్‌ ఉద్యోగుల భవనంలోని ఓ గదిని కేటాయించారు. జెడ్పీ కార్యాలయంలోని అరకొర సౌకర్యాల మధ్య ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదేభవనంలో ఎంపీడీవో ఆఫీసు

పెద్దపల్లి మండల పరిషత్‌ కార్యాలయాన్ని బస్టాండ్‌ సమీపంలో 50 ఏళ్లపాటు కొనసాగించారు. సొంతభవనంలో సుదీర్ఘకాలం సేవలు అందించిన ఆ భవనం, స్థలాన్ని ఆర్టీసీ బస్సు డిపోకు కేటాయించడంతో సమస్యలు మొదలయ్యాయి. అప్పట్నుంచి ఆ కార్యాలయం అటు, ఇటు తిరుగుతూ ఇప్పుడు ఐటీఐ ఆవరణలోకి చేరింది. ఎంపీడీవో కార్యాలయ భవనం కోసం జెడ్పీ భవనంలోనే ఓ అంతస్తులో నిర్మాణాలు చేపట్టారు. ఈ పనులు పూర్తయితేనే ఎంపీడీవో కార్యాలయానికి సొంత భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

నిధులు రాక.. ఆగిన పనులు

జెడ్పీ భవన నిర్మాణాన్ని రూ.కోటి60లక్షల వ్యయంతో చేపట్టారు. పనులు పొందిన కాంట్రాక్టర్‌ పునాదుల వరకు నిర్మాణం చేశారు. చేసిన పనుల కోసం జనరల్‌ ఫండ్‌ నుంచి అధికారులు రూ.40లక్షలు చెల్లించారు. కాంట్రాక్టర్‌ పొందిన చెక్కులను బ్యాంకు ఖాతాలో జమచేసి నెలలు గడుస్తున్నా ఇంకా నిధులు విడుదల కాడంలేదు. దీంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేసినట్లు సమాచారం.

పేరుకే ‘పెద్ద’పల్లి జిల్లా పరిషత్‌

ముందుకు సాగని నిర్మాణ పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement