జమ్మికుంట: తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళపై అత్యాచారానికి యత్నించాడని, ఆపై ఇరు కుటుంబాల మధ్య దారితీసిన గొడవను మనుసులో పెట్టుకుని ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. సోమవారం జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ రామకృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు. మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేశ్‌కు అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. సదరు మహిళపై అంకుషాపూర్ గ్రామానికి చెందిన పైతరి మొగిలి(52)లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఫిబ్రవరిలో మొగిలిపై కేసు నమోదైంది. జైలుకు వెళ్లివచ్చిన మొగిలి సదరు మహిళతో పాటు మహేశ్ కుటుంబాల్లో గొడవలకు కారణమయ్యాడు. దీంతో మొగిలిపై పగ పెంచుకున్న మహేశ్ అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 27న రాత్రి మడిపల్లి గ్రామంలోని పీరీల పండుగకు వచ్చిన మొగిలి తిరిగి ఇంటికి వెళ్తుండగా మడిపల్లి, అంకుషాపూర్ గ్రామాల మధ్య ఇనుపరాడ్‌తో దాడిచేసి హత్య చేశాడు. అనంతరం రాడ్‌ను మడిపల్లి శివారులోని తన వ్యవసాయ బావి వద్ద పడేసి ఇంటి వెళ్లిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొగిలిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని, అతని నుంచి ఇనుప రాడ్, సెల్‌ఫోన్, బైక్ స్వాదీనం చేసుకుని, రిమాండ్ చేశామని ఏసీపీ తెలిపారు ఎస్సై రవి, కానిస్టేబుళ్లు జలేందర్, శ్రీకాంత్, యాకూబ్, రవి ఉన్నారు.
మొగిలి హత్యకేసులో నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడించిన ఏసీపీ మాధవి


