మంథని: మున్సిపల్ పరిధిలో మాస్టర్ ప్లాన్ అమలుకు ముహూర్తం కుదిరింది. పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో నుంచి పాత పెట్రోల్ బంక్ కూడలి వరకు వంద అడుగుల రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు అధికారులు ఎట్టకేలకు మార్కింగ్ చేశారు. సాంకేతిక సమస్య సాకుతో చాలాసంవత్సరాలుగా రోడ్డు విస్తరణకు నోచుకోలేదు.
ముప్పయి ఏళ్లకు మోక్షం..
సుమారు 30ఏళ్ల క్రితమే ఆర్టీసీ బస్సు డిపో నుంచి పాత పెట్రోల్ బంక్ వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు మార్కింగ్ చేశారు. డిపో ప్రహరీ కూల్చివేత ప్రారంభం కాగానే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఎరుకులగూడెం వాసులు.. పొక్లెయిన్‌తో బలవంతంగా కూల్చితే తీవ్రంగా నష్టపోతామనే ఉద్దేశంతో తమ ఇళ్లు వారే స్వచ్ఛందంగా కూల్చివేసుకున్నారు. పరిహారం చెల్లిస్తామని అప్పటి ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినా ఇప్పటివరకు పైసా పరిహారం రాలేదని నిర్వాసితులు తెలిపారు. కొందరు ఇళ్లు కూల్చకుండా కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినట్లు సమాచారం. అప్పటినుంచి రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు పెండింగ్ పడ్డాయి. పనులు స్తంభించడంతో కొంతమంది మళ్లీ నిర్మాణాలు చేపట్టారు. ఎట్టకేలకు అధికారులు గత బుధవారం మరోసారి వంద ఫీట్ల రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేయడంతో పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రణాళికలు సిద్ధం
మున్సిపల్‌లో మాస్టర్ ప్లాన్ అమలుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్ర మంలోనే పట్టణంలోని ప్రధాన కూడలిలో వంద ఫీట్ల రోడ్లు, అవసరమున్న చోట మురుగునీటి కాల్వలు, ప్రధాన చౌరస్తాల విస్తరణతోపాటు మరి న్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. పట్టణ సుందరీకరణతోపాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటు న్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ప్రధాన రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒక వాహనం వెళ్తే మరో వాహనం వెళ్లడానికి వీలు లేకుండా ఇరుకుగా ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. తరచూ ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రధాన చౌరస్తా, శ్రీపాదచౌక్, బొక్కలవాగు వంతెన వరకు వ్యాపార కూడలి కావడంతో సమస్య తీవ్రత అధికంగా ఉంది. విస్తరణ, అభివృద్ధి పను లకు ఇప్పుడైనా ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయా లేదా వేచిచూడాల్సిందే.
మున్సిపల్‌లో అమలుకు ముహూర్తం
బస్సు డిపో నుంచి పెట్రోక్ బంక్ కూడలి వరకు విస్తరణ
వంద అడుగులకు రహదారి అభివృద్ధికి వేగంగా చర్యలు
చాలాసంవత్సరాల తర్వాత మారనున్న పట్టణ రూపురేఖలు


