మంథనిరూరల్/పెద్దపల్లి: ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ ఒకవైపు చెబుతుండగా.. దీనిని అధిగమించేందుకు స్వల్పకాలిక వరి విత్తనాలు ఉపయోగిస్తూ పంటలు వేయాలని వ్యవసాయాధికారులు మరోవైపు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ఏడు రకాల వరి విత్తనాలను రైతు ముంగిట్లోకి తీసుకువచ్చి విత్తన మేళా నిర్వహిస్తున్నారు.
ప్రతీ క్లస్టర్‌లో..
జిల్లాలో 263 గ్రామపంచాయతీలు ఉండగా 54 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిలోని రైతువేదికల్లో ఈనెల 23, 24వ తేదీల్లో విత్తనమేళా నిర్వహించారు. ఈనెల 23న కొన్ని క్లస్టర్లలో, 24న మరికొన్నింటిలో ఏడు రకాల వరి వంగడాలతోపాటు పత్తి విత్తనాలు, నానో యూరియాను ప్రదర్శనగా పెట్టి రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం సాగు సమయం కావడంతో రైతులు అందుబాటులో లేకపోతే మరికొద్దిరోజులు కూడా విత్తన మేళా నిర్వహించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఏడు రకాల వరి విత్తనాలు ఇవే..
ప్రస్తుతం తక్కువ నీరు, స్వల్పవ్యవధిలో దిగుబడి ఇచ్చే వరి విత్తనాలను ఎంచుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరాం, కేఎన్‌ఎం 7715, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్‌ఎం 1638 వరి విత్తనాలతోపాటు పత్తి విత్తనాలను మేళాలో ప్రదర్శనగా పెడుతున్నారు. వీటితో ప్రయోజనాలు, దిగుబడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
చీడపీడలను తట్టుకునే శక్తి..
ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల స్వల్పకాలిక వరి విత్తనాలకు అన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 120 రోజుల నుంచి 140రోజుల వ్యవధిలోనే దిగుబడి వస్తుందని అవగాహన కల్పిస్తున్నారు.
స్వల్పకాలిక పంటలే వేయాలి


