పెద్దపల్లి: రామగుండం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని సహించబోమని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి రామగుండం అభివృద్ధిపై కలెక్టరేట్‌లో గురువారం ఆయన సమీక్షించారు. నిధులు సిద్ధంగా ఉన్నా శ్మశానవాటికలు, మహిళాశక్తి భవనాలు, విద్యాసంస్థల అభివృద్ధి, తాగునీరు, వసతుల పనుల్లో ఆశించినస్థాయిలో పురోగతి లేదన్నారు. ఏడాది గడిచినా పనులు పూర్తికాకపోవడం అధికారుల పనితీరును ప్రతిబింబిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితయ్యాయని, తక్షణం గ్రౌండింగ్ చేయాలని సూచించారు.
కేజీబీవీల్లో విద్య నాణ్యత పెంచాలి
కేజీబీవీల్లో విద్య నాణ్యత పెంపుపై దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కేజీబీవీల నిర్వహణపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడా రు. విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోతే దానికి ఉపాధ్యాయులు, విద్యాశాఖ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సీసీడీవో కవిత, కేజీబీవీల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
పిల్లల హాజరు శాతం పెంచాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం పెంచడంతోపాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సీపీడీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లతో తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జూలై ఒకటిన అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రుల సమక్షంలో సమావేశాలు నిర్వహించి, పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, హాజరు, విద్యాభివృద్ధిపై సూచనలు, సలహాలు స్వీకరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి కాళిందిని తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ప్రగతిపై కలెక్టర్ శ్రీహర్ష


