● విద్యాశాఖ జేడీ ఉషారాణి
పెద్దపల్లి: జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి తెలిపారు. స్థానిక అధికారులతో కలిసి స్కూళ్లకు అవసరమైన స్థలాల కోసం ఆమె మంగళరం స్థల పరిశీలన చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన సుల్తానాబాద్ ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కళాశాల మైదానం, రామగుండం హైస్కూల్, జూనియర్ కళాశాల మైదానం, మంథని హైస్కూల్, జూనియర్ కళాశాల మైదానాన్ని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన, అధికారులు ఆంజనేయరావు, షఫీమియా, అశోక్, శారద, రామ్‌చందర్‌రెడ్డి, రాజయ్య, రత్నాకర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఒక్కో స్కూల్‌కు రూ.15కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి జూనియర్ కళాశాల వరకు కార్పొరేట్ స్థాయిలో ఇందులో విద్యాబోధన ఉంటుందని వివరించారు. ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ అందులో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. 80 నుంచి 100 మంది ఉపాధ్యాయులు ఇందులో విద్యా బోధన చేసే అవకాశం ఉందని చెప్పారు. అధికారులు పాల్గొన్నారు.


