బడిలో బాదుడు | - | Sakshi
Sakshi News home page

బడిలో బాదుడు

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

రామగుండంలోని ఓ ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం ఏకంగా తమ బడిలోనే బుక్స్‌ కొనుగోలు చేయాలని యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ పిల్లలకు అవసరమైన పుస్తకాల వివరాలను తల్లిదండ్రులు ఆ యాప్‌లో నమోదు చేస్తే అందిస్తామని యాజమాన్యం చెబుతోంది. కానీ, నిర్వాహకులరకు నచ్చిన ధరలే చెల్లించాలనడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.

పెద్దపల్లికి చెందిన ఓ చిరువ్యాపారి తన కుమార్తెను ప్రైవేట్‌ పాఠశాలలో చేర్పించేందుకు వెళ్తే రూ.40వేల ఫీజు అవుతుందని, పుస్తకాలు, దుస్తులు అదనమని యాజమాన్యం స్పష్టం చేసింది. గతేడాదితో పోల్చితే 30 శాతం ఫీజు, బుక్స్‌, డ్రెస్సుల ధరలు పెరగడంతో ఏం చేయాలో తోచక పాపను బడిలో చేర్పించకుండానే వెనుదిరిగాడు.

అడిగినంత కట్టాలి.. అక్కడే కొనుగోలు చేయాలి ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల మోత పుస్తకాలు, యూనిఫామ్‌ మాటున నిర్వాహకుల దోపిడీ ఏటా ధరలు కూడా పెంచేస్తున్న యాజమాన్యాలు ఎక్కడా కనిపించని ఫీజు పట్టికలు తనిఖీలు విస్మరించిన విద్యాశాఖ అధికారులు

సాక్షి,పెద్దపల్లి: బడిలో చదువు సంగతి దేవుడెరుగు.. ఫీజుల బాదుడు తల్లిదండ్రుల జేబులు గుళ్లచేస్తోంది. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం, టై, బెల్ట్‌ల విక్రయాలతో బుక్‌స్టాల్స్‌, బట్టల దుకాణాలను మరిపిస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలు.. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలే వినియోగించాలని నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన పుస్తకాలే కొనుగోలు చేయాలి. అంతేకాదు.. ఎంత ధర చెబితే అంతే చెల్లించాలి. జిల్లాలో 175కు పైగా ప్రైవేట్‌ బడులు ఉన్నాయి. అందులో సుమారు 60 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు.

ఫీజుల దోపిడీ తీరిది..

ఫీజు వసూళ్లలో ప్రైవేటు పాఠశాలల తీరేవేరు. నోటికి వచ్చినంత ఫీజు చెప్పడం, డిస్కౌంట్‌ పేరిట కొంత తగ్గించడం, అందినకాడికి వసూలు చేయడం పరిపాటిగా మారింది. పుస్తకాలు, భవన సముదాయం, సెస్‌, పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, దుస్తులు, కల్చరల్‌ యాక్టివిటీస్‌, బస్సులు, క్రీడల చార్జీలు అని తల్లిదండ్రులను బాదేస్తున్నారు. పాఠ్యపుస్తకాలకు అదనంగా నీట్‌, ఐఐటీ, ఒలింపియాడ్‌, సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌, టెక్నో, ఈ– టెక్నో అని ఆకర్షణీయమైన పేర్లు, ప్రత్యేక శిక్షణ పేరిట అదనపు స్టడీమెటీరియల్‌, క్వశ్చన్‌ బ్యాంకుల పేరుతో బాదేస్తున్నారు.

కానరాని ఫీజులు.. టీచర్ల అర్హత బోర్డులు

ఏ ప్రైవేటు పాఠశాలలోనూ విద్యాహక్కు చట్టం నిబంధనలు అమలు కావడం లేదు. ఈ చట్టం ప్రకారం.. ప్రభుత్వం 12–సీ కింద 25శాతం సీట్లు పేదలకు ఉచితంగా కేటాయించాలి. స్కూళ్లలో సౌకర్యాలు, ఇతర అంశాల వారీగా స్టార్స్‌ కేటాయించి, ఏ తరగతికి ఎంతఫీజు తీసుకుంటున్నారనే వివరాలను యాజమాన్యాలు విద్యాశాఖాధికారులకు సమర్పించాలి. ఆ మేరకు స్కూల్‌ వద్ద ఫీజు వివరాలతో బోర్డు ఏర్పాటుచేయాలి. వీటిని ఏర్పాటు చేయకుండా, రెండురెట్లకు మించి ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రతీ పాఠశాలలో తల్లిదండ్రులు, టీచర్లు, ప్రిన్సిపాల్‌తో కూడిన కమిటీలు ఏర్పాటు చేసి, సభ్యుల వివరాలు, తీర్మానాలను ఎంఈవో అనుమతితో డీఈవోకు అందజేయాలి. కమిటీ సిఫారసులను నోటీసు బోర్డుపై అంటించాలి. ఈ సిఫారసు ఆధారంగా ఫీజు పెంచాలి. కానీ, ఇవెక్కడా కనిపించడంలేదు. టీచర్ల విద్యార్హతల కూడిన చార్ట్‌ నోటీసు బోర్డు కచ్చితంగా ఏర్పాటు చేయాలి. జిల్లాలో అలాంటి బోర్డులేవీ కనిపించడంలేదు. అర్హత ఉన్నవారిని నియమించుకోవాలంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో యాజమాన్యాలు అర్హతలేని వారితో పనిచేయించుకుంటున్నట్లు తెలుస్తోంది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement