పెద్దపల్లి: జిల్లాలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సగటున 71.2 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కమాన్‌పూర్ మండలంలో అత్యధికంగా 116.4 మి.మీ., జూలపల్లి మండలంలో అత్యల్పంగా 27.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వివరించారు.
కమాన్‌పూర్: వివిధ గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు భారీవర్షం కురిసింది. పంట పొలాలు వరదనీటితో నిండిపోయాయి. దీంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాల్వశ్రీరాంపూర్: సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పత్తి విత్తనాలు వేసిన రైతులు ఎంతోఊరట చెందారు. దుక్కులు దున్నిన మరికొందరు మంగళవారం పత్తి విత్తనాలు వేశారు. రోహిణి కార్తెలో వరినారు పోసినవారు ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ నాటు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
విరిగి రోడ్డుపై పడిన చెట్లు.. రాకపోకలు బంద్
కాల్వశ్రీరాంపూర్ – సుల్తానాబాద్ మధ్య భారీ చెట్లు పడిపోయాయి. తారుపల్లి – మీర్జంపేట మధ్య చెట్లకొమ్మలు విరిగి పడ్డాయి. లక్ష్మీపురం – గంగారం తదితర గ్రామాల్లోనూ చెట్లు విరిగి పడడంతో రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది. అధికారులు, సర్పంచులు బంగారి రమేశ్, రేకుల జ్యోతి, గాజనవేన స్వరూప జేసీ సాయంతో రోడ్లపై చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.


