సింగరేణిలో రచ్చరచ్చ వాస్తవాలపై రాజకీయ పార్టీల పట్టు ప్రతీబొగ్గు పెళ్లకు లెక్క ఉంటుందని వెల్లడిస్తున్న యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గోదావరిఖని: సింగరేణిలో బొగ్గు దుమారం లేస్తోంది. ఉత్పత్తి చేసిన బొగ్గు, గనులపై ఉన్న నిల్వలపై భారీవ్యత్యాసం ఉంటోందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తుండగా.. ప్రతీబొగ్గుపెళ్లకు లెక్కుంటుందని, రవాణా అత్యంత పారదర్శకంగా కొనసాగుతోందని సింగరేణి చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారణ జరిపి వాస్తవాలు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాయల్టీ, లాభాల చెల్లింపులపై?
గత ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చూపించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దఎత్తున రాయల్టీ, లాభాల్లో వాటా పంచి సంస్థకు పెద్ద మొత్తంలో నష్టం చేశారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే సింగరేణికి భారీగా లాభాలు వచ్చాయని చూపించి మెప్పు పొందేందుకే రాయల్టీ, లాభాలా వాటా పంపిణీ చేశారని ఆయా పార్టీల నేతలు తూర్పారబడుతున్నారు. ఇదేవిషయంపై కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం సమస్యను మరింత జటిలం చేసిందంటున్నారు. బొగ్గు ఉత్పత్తి నుంచి మొదలు.. రవాణా వరకు అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని సింగరేణి సీ ఎండీ ప్రకటిస్తున్నారు. అయితే బొగ్గు నిల్వలు త ప్పుగా చూపిస్తున్నారా? లేక బొగ్గు పక్కదారి పడుతోందా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో కార్మికవర్గం తలగోక్కుంటోంది.
లేనిబొగ్గు నిల్వలతో సంస్థకు ప్రమాదం
లేనిబొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపిస్తూ సింగరేణికి భారీగా లాభాలొచ్చాయని, అందులో కార్మిక వర్గానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ప్రకటించడంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇలా చేస్తే సీఎస్‌ఆర్ నిధులు కూడా ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి అనుగుణంగా లెక్కలు చెబితే సంస్థకు లాభాలు వస్తాయని, లేనిబొగ్గు నిల్వలు చూపిస్తూ సంస్థను నష్టాల్లో తోయడం సరికాదని బీఆర్‌ఎస్ అనుంబంధ టీబీజీకేఎస్ ఆరోపిస్తోంది. సింగరేణి ప్రాంతంలో బీఆర్‌ఎస్ అధినేత హరీశ్‌రావు ఇటీవల పర్యటిస్తూ సింగరేణి తీరు తెన్నులు, బొగ్గు నిల్వల్లో జరిగిన కుంభకోణంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ద్వారా వివరించడం కార్మిక వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఉత్పత్తి ఎంత.. వినియోగం ఎంత?
సింగరేణిలో వాస్తవానికి బొగ్గు ఉత్పత్తి ఎంత, వినియోగదారులకు ఎంత సరఫరా చేస్తున్నారు? తదితర అంశాలపై వాస్తవాలు ప్రకటించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతేకాదు.. ఉత్పత్తి, నిల్వలు, విక్రయాలపై ఆరా తీస్తుండడంతో సింగరేణి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని ఏరియాల్లో ఉత్పత్తి చేస్తున్న, రవాణా చేస్తున్న, వినియోగదారులకు విక్రయించిన బొగ్గుపై పూర్తి వివరాలపై యాజమాన్యం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు.. లేనిబొగ్గు ఉత్పత్తిని చూపించి సంస్థకు నష్టం తెచ్చిన అధికారులపై చర్య తీసుకోవాల్సిందేనని డిమాండ్ పెరుగుతోంది.


