ఫుడ్ పాయిజన్ ఘటనతో యంత్రాంగం అప్రమత్తం కలెక్టర్ ఆదేశాలతో అధికారుల దాడులు గోదావరిఖనిలో 10 రెస్టారెంట్లు, బేకరీల్లో తనిఖీలు అనుమతి లేని ఆహార రంగులను వినియోగిస్తున్న వైనం నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లకు హెచ్చరికలు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో మెడికోలు ఇటీవల ఆహారం వికటించి అస్వస్థతకు గురైన ఘటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై నిఘా పెట్టింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఫుడ్ సేఫ్టీ జిల్లా ఇన్‌చార్జి ఆఫీసర్ అంకిత్‌రెడ్డి ప్రత్యేక తనిఖీ చేపట్టారు. మొత్తం 10 రెస్టారెంట్లు, బేకరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార భద్రతా నిబంధనల అమలు తీరు పరిశీలించారు. బాలాజీ వికాస్ స్వీట్ హౌస్, తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, దసరా దావత్ రెస్టారెంట్, ఎస్‌ఏ అన్ లిమిటెడ్ కేఫ్ అండ్ బేకర్స్, వాసంతి లైవ్ కిచెన్, ఏకే మల్టీబైట్స్ బేకర్స్, దియా ఫ్యామిలీ రెస్టారెంట్, జాయికా మండీ హౌస్, బేకర్స్ డిలైట్ ది లైవ్ కేక్ షాప్, డేనియల్స్ కేక్ షాప్‌లను తనిఖీ చేశారు. కొన్ని రెస్టారెంట్లలో ఆహార పదార్థాల తయారీలో అనుమతించని ఆహార రంగులను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పారవేయడంతోపాటు, వాటితో తయారైన ఆహార పదార్థాలను కూడా తొలగించారు. ఎస్‌ఏ అన్ లిమిటెడ్ కేఫ్ అండ్ బేకర్స్ వంటగది పూర్తిగా అపరిశుభ్రంగా, అనారోగ్యకర పరిస్థితుల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లోపాలను సరిదిద్దేందుకు యాజమాన్యానికి వారం రోజుల గడువు విధించారు. జాయికా మండీహౌస్‌లో వినియోగిస్తున్న మయోనైస్ ముడిగుడ్లతో తయారు చేసినదిగా అనుమానం వ్యక్తం కావడంతో నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అంకిత్‌రెడ్డి హెచ్చరించారు.
బేకరీలు, రెస్టారెంట్లకు జరిమానా
బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు రెస్టారెంట్లు, బేకరీలను తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దసరా దావత్ కిచెన్, అన్ లిమిటెడ్, బేకర్స్ డిలైట్ షాపులకు రూ.2,000 చొప్పున జరిమానా విధించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సంపత్ కుమార్, నాగభూషణం, వార్డు ఆఫీసర్ రామకృష్ణ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


