పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్‌వో రాజేశ్వరితో కలిసి కలెక్టరేట్ సోమవారం ఆయన ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చెందిన నోముల రాజేశ్వర్‌రెడ్డి.. తమ ఇంటిని ఇన్‌లైన్‌లో నమోదు చేసేందుకు దరఖాస్తు చేసుకోగా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దరఖాస్తు చేశాడు. రామగుండం గౌతమినగర్‌కు చెందిన డి.కాశయ్య.. మల్కాపురంలోని సర్వే నంబర్ 125/3లో గల 20 ఎకరాలను ఎక్స్‌సర్వీస్‌మెన్ కోసం 1981లో కేటాయించారని, ఇందులో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదని కోరారు. ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన వేముల నర్సమ్మ.. సర్వే నంబర్ 474/1లోని తన ఎకరం భూమిని కొందరు ఆక్రమించాలని చూస్తున్నారని వేడుకుంది. గోదావరిఖని సూర్యనగర్‌కు చెందిన ఆర్.రాధ.. తన కుమారుడికి ప్రభుత్వ విద్యాసంస్థలోని హాస్టల్లో సీటు ఇప్పించాలని కోరింది. తన పొలానికి వెళ్లేందుకు దారి కల్పించాలని ఓదెల మండలానికి చెందిన రైతు తాటికొండ రమేశ్ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై నియంత్రణ చట్టం అమలు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లాల ప్రశాంత్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
అవినీతిని సహించేదిలేదు
క్షేత్రస్థాయిలోని కొందరు సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, అవినీతిని ఏమాత్రం సహించబోమని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. అదనపు కలెక్టర్లు అరుణ వెంకట్‌రెడ్డితో కలిసి వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. అధికారులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. కొన్నిశాఖల్లో ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఉద్దేశపూర్వక జాప్యాన్ని వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ తదితర సిబ్బందికి వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనంతో సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులకు నిర్ణీత సమయంలో సమాధానాలు అందించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


