పెద్దపల్లి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి వర్షం కురిసింది. సుల్తానాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల ధాటికి ఓ రైస్‌మిల్లు పైకప్పు కొట్లుకుపోయింది.
ఆశించిన స్థాయిలో కురవని వానలు..
వానాకాలం సీజన్ ప్రారంభమైనా.. ఇప్పటివరకు ఆశించినస్థాయిలో వర్షాలు కురవలేదు. ఎండల తీ వ్రత తగ్గలేదు. రైతులు పంటలు వేసేందుకు నెల రోజులుగా వానదేవుని కోసం ఎదురుచూస్తున్నారు. నైరుతి రుతుపవనాలతో వర్షాలు కురుస్తాయని చెబుతున్నా.. వాటి రాక ఆలస్యమవుతోంది. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు ఉత్సాహంగా ఉన్నా.. సాగు చేయాలంటే నీటివనరులు అవసరం. కొందరు పంపుసెట్లు, బావుల ఆధారంగా వరినారు పోసినా.. చెరువులు, కుంటలు, ఎస్సారెస్పీ కాలువల ఆధారంగా సాగు చేసేవారు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
నేటినుంచి విత్తనమేళా
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రైతువేదికల్లో ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు విత్తనమేళా నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల వరి రకాలకే బోనస్ వర్తింపజేస్తారని పేర్కొన్నారు. రైతులు వరికి బదులుగా పెసర, మినుము, అలసంద, కంది, నువ్వులు, జొన్న, సజ్జలు వంటి ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. వీటికి సంబంధించిన విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు.


