అనుమానం రాకుండా అద్దె ఇళ్లలో నిర్వహణ ఆన్‌లైన్ జూదం బారిన యువత, ఉద్యోగులు జూదరులకు కలిసొచ్చిన నగదు రహిత లావాదేవీలు
జిల్లాలో జోరుగా పేకాట
సాక్షి పెద్దపల్లి: ‘శత కోటి దరిద్రాలకు, అనంత కోటి ఉపాయాలన్నట్టు’ పెరిగిన
సాంకేతికతను పేకాటరాయుళ్లు వినియోగించుకుంటూ.. డిజిటల్ పేమెంట్స్‌తో కొందరు, మరికొందరు ఆన్‌లైన్‌లో జూదం ఆడి జీవితాలను ఛిద్రం చేసుకుంటూ, బతుకులను అంధకారంలోకి జార్చుకుంటున్నారు. ఆఫ్‌లైన్‌లో ఆడేవారు దాడి చేసిన నగదు దొరకకుండా, జేబులో రూపాయి లేకుండా జోరుగా ఆడేస్తుండగా, మరికొందరు ఆన్‌లైన్‌లో నకిలీ జీపీఎస్‌లతో మూడుముక్కలు ఆడుతున్నారు. గతంలో పోలీసులు ఉక్కుపాదం మోపడంతో మూతపడ్డ శిబిరాలన్నీ, ఇప్పుడు కొత్తకొత్త స్థావరాల్లో సాగుతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో జూదం నిషేధించడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీ కోడ్‌లను ఉపయోగించి మోబైల్‌లో యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నారు. దీనికోసం నకిలీ జీపీఎస్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. దాని ద్వారా రమ్మీ, మూడు ముక్కల ఆటకు సంబంధించిన జూదం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోని రూ.100 నుంచి రూ.లక్షల్లో డబ్బుపెట్టి ఆట ఆడుతున్నారు. మొదట డబ్బులు పెడితే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వస్తాయి. ఆ తర్వాత క్రమంగా పోతూనే ఉంటాయి. పోయిన చోటే డబ్బులు రాబట్టుకోవాలనే ఆశతో రూ.లక్షల్లో అప్పులు చేస్తున్నారు.
అంతా నగదు రహితమే..
జిల్లాలో నగదు రహిత జూదం విచ్చలవిడిగా సాగుతోంది. పలువురు రాజకీయ నాయకులు, వైద్యులు, అధికారులు, టీచర్లు ఈ జూదం ఆడుతున్నట్టు తెలుస్తోంది. జూదం నిర్వహకులంతా కరెంట్ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నవారే. కొందరు ఈ అకౌంట్ల ఆధారంగా స్వైప్ మిషన్లతో చెల్లింపులు చేస్తే.. మరికొందరు సెల్‌ఫోన్లలో యాప్స్ ద్వారా నగదును బదిలీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. గతం కంటే సేఫ్‌గా పేకాడుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని, ఎవరితోనూ ఇబ్బందులు లేవని, కేసులయ్యే అవకాశాలు తగ్గిపోయాయని జూదరులు అంటున్నారు. దీనికోసం సాధారణ గృహాల మధ్య ఉన్న ఇండ్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్లాట్స్, ఇళ్లు అద్దెకు తీసుకుని పేకాట సాగిస్తున్నారు. పేకాట ఆడేవారికి నిర్వాహకులు సౌకర్యాలు కల్పిస్తూ.. ఒక్కో ఆటకు వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పేకాట కేంద్రాల నిర్వాహకులు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇవే కాకుండా పేకాట ఆడేవారికి మద్యం, భోజనం, సిగరెట్లు సమకూరుస్తూ అందుకు అదనంగా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాకేంద్రంలో అధికార పార్టీ సర్పంచ్ జూదరులను పిలిచి తన ఇంట్లో పేకాట కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఆస్తులు కోల్పోయి ఆత్మహత్యలు
జూదం వ్యసనంగా మారిన కొందరు నిత్యం పేకాట ఆడుతూ తమ ఆస్తులను కోల్పోతున్నారు. గతంలో పేకాటతో ఆర్థికంగా దివాలా తీసి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. పలువురు మధ్య తరగతికి చెందిన వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు కూడా పేకాట వ్యసనపరులుగా మారి ఆస్తులను తెగనమ్ముకుంటూ దివాలా తీస్తున్నారు. పేకాట వ్యసనం నుంచి దూరం చేసేందుకు పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహించాలని, పట్టుబడిన సందర్భాల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో మూడేళ్లలో కేసుల వివరాలు
ఇయర్ కేసులు నిందితులు సీజ్‌చేసిన అమౌంట్
2024 132 854 42,08,761
2025 198 1,166 27,53,485
2026 57 374 12,65,455
పేకాటపై
ప్రత్యేక నిఘా
జిల్లాలో పేకాటను అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ప్రజలకు ఎక్కడైనా పేకాట ఆడినట్లు సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలి. చర్యలు తీసుకుంటాం. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
– అంబర్‌కిషోర్ ఝా,
సీపీ, రామగుండం


