పాగా కోసం పోటీ పడుతున్న పార్టీలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల వ్యూహాలు అనుబంద సంఘాల బలోపేతంపై దృష్టి
గోదావరిఖని: సింగరేణి కేవలం బొగ్గు గనుల సంస్థ మాత్రమే కాదు.. తెలంగాణ రాజకీయాల దిశను ప్రభావితం చేసే శక్తివంతమైన ప్రాంతం. కార్మికుల సంక్షేమం, ఉద్యోగాల భర్తీ, కారుణ్య నియామకాలు, గనుల భవిష్యత్ వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇచ్చే పార్టీకి రాబోయే రోజుల్లో రాజకీయంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సింగరేణి వైపు అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడు జిల్లాలు, 13 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో పొలిటికల్ హీట్ పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉంది. రామగుండం, మంథని, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, భూపాలపల్లి, ములుగు, వైరా, పాల్వంచ తదితర ప్రాంతాల్లో సింగరేణి గనులున్నాయి. వీటిలో సుమారు 40వేల మంది పర్మినెంట్ కార్మికులు, మరో 30వేల మంది కాంట్రాక్టు కార్మికులు, పరోక్షంగా మరో 20వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అంతే కాకుండా ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, అల్ట్రాటెక్, రైల్వే, జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు కూడా సింగరేణితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్నాయి. ఈప్రాంతంలో పట్టు సాధిస్తే సుమారు లక్ష కుటుంబాల్లో పట్టు సాధించవచ్చనే ఆలోచనతో ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. గనులు తగ్గిపోతుండటం, పర్మినెంట్ కార్మికులు తగ్గి రావాల్సిన హక్కులు అందకపోవడం.. ఇలా అనేక సమస్యలతో సింగరేణీయులు ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో అన్ని పార్టీలు తమ దృష్టిని కోల్‌బెల్ట్‌పై మరల్చాయి.
పాగా కోసం ప్రయత్నాలు
సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు సమీపించడం, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈప్రాంతంలో పాగా వేయడం కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీలతో పాటు టీబీజీకేఏస్ గౌరవాధ్యక్షురాలిగా ఉండి కార్మిక క్షేత్రానికి పరిచయం ఉన్న టీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత కూడా బాయిబాట పట్టారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఇప్పటికే పర్యటించగా, బీజేపీ కూడా పట్టుకు సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో పర్యటన పూర్తి చేసింది. అనేక సమస్యలతో సతమతమవుతున్న కార్మికులకు ప్రధానంగా కారుణ్య నియామకాలు నిలిచిపోవడం, అధికార కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోవడంతో ఈ ప్రాంతంలో పట్టుకు పోరాట బాట పట్టాయి. తమ అనుబంద సంఘాల బలోపేతంపై దృష్టి సారించాయి.
అయితే తామెప్పుడు కార్మికుల పక్షమేనని అధికార కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్మిక క్షేత్రంలో పర్యటించి కారుణ్యనియామక పత్రాలు అందజేశారు. అయితే భవిష్యత్ కారుణ్య నియామకాలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును కార్మికుల్లోకి తీసుకెళ్లి ఎండగట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కార్మికులు సమస్యలతో సతమతమవుతుండగా, రాజకీయ పార్టీలు అండగా నిలిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికార పార్టీపైనే ఉందని కార్మిక లోకం గళం విప్పుతోంది.


