‘మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ చేరింది. కానీ సదరు వ్యక్తి రశీదు ఇవ్వాలని మీసేవ ఆపరేటర్‌ను అడిగాడు. శుక్రవారం నుంచే రశీదును ప్రింట్ తీసి ఇవ్వొద్దని అధికారులు ఆదేశించారని చెబితే, నాకు రశీదు లేకుంటే సర్టిఫి కెట్ ఎలా తీసుకునేది అంటూ వాదనకు దిగారు’. తొలి రోజు కావడంతో ప్రజల్లో ఇంకా అవగాహన రాలేదని, వారితో వాగ్వాదం పెట్టుకోకుండా సామరస్యంగా చెప్పాలని సంబంధిత శాఖ అధికారులు మీసేవ నిర్వాహకులకు సూచించారు.
పెద్దపల్లిరూరల్: కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్.. ఇతర రెవెన్యూ సేవలు పొందేందుకు మీసేవ కేంద్రాలకు వెళ్లే దరఖాస్తుదారులకు ఇక నుంచి డిజిటల్‌గా సేవలందుతాయి. వారు చేసుకున్న దరఖాస్తుకు సంబంధించి రశీదు ఇవ్వరు. ప్రభుత్వం పేపర్‌లెస్ వర్క్‌ను అమల్లోకి తేవాలని నిర్ణయించిన విషయం విదితమే. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, వాటికి అనుసంధానంగా ఉన్న మీసేవ లాంటి కేంద్రాల్లోనూ డిజిటల్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఎస్‌ఎంఎస్ రూపంలో డిజిటల్ రశీదు
తమకు అవసరమున్న సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాల్లో చేసుకున్న దరఖాస్తుకు సంబంధించిన డిజిటల్ రశీదు లింక్ ద్వారా ఆ దరఖాస్తులో నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు చేరుతుంది. ఎస్‌ఎంఎస్ పొరపాటున డిలీట్ అయితే మీసేవ కేంద్రానికి వెళ్లి మళ్లీ పొందే అవకాశాన్ని కల్పించారు.
అక్రమాలకు చెక్
మీసేవ నిర్వాహకుల్లో కొందరు సర్టిఫికెట్లకు సంబంధించి అదనపు వసూళ్లు చేసి అక్రమార్జనకు పాల్పడే అవకాశముండేది. దరఖాస్తుదారుడి సెల్ నంబర్ కాకుండా ఏదో ఓ నెంబరు రాసి సర్టిఫికెట్లను జారీ చేసి వారి నుంచి ఎక్కువ మొత్తాన్ని వసూలు చేశారనే ఫిర్యాదులున్నాయి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా దరఖాస్తు దారుడు తన మొబైల్ నంబర్‌నే రాయాల్సి ఉంటుంది. ఆ మొబైల్‌లో ఇంటర్నెట్ బ్యాలెన్సు ను కూడా మెయింటెన్ చేయాల్సిన అవసరముంటుంది.
స్కాన్ సరిగ్గా చేయాలి
మీసేవ ఆపరేటర్లు తమ వద్దకు వచ్చిన వారి దరఖాస్తులను స్కాన్ సరిగ్గా సంబంధిత శాఖ అధికారులకు కనిపించేలా చేయాలని అధికారులు సూచించారు. ఆ దరఖాస్తులను సంబంధిత ఆఫీసుల్లో అప్పగించాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు సులువుగా వేగంగా సేవలు అందించాలనే ఆలోచనతోనే ఇప్పటిదాకా ఉన్న పేపర్ రశీదును ఇక నుంచి ఇవ్వకుండా పేపర్‌లెస్ పద్ధతిని పాటించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని మీసేవ ఆపరేటర్లు ప్రజల్లో అవగాహన పెంచేలా చొరవ చూపాలన్నారు.


