గోదావరిఖని: అత్యంత పారదర్శకంగా బొగ్గురవాణా సాగుతోందని, ప్రతీ టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ అన్నారు. ఆదివారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థగా దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పారి శ్రామిక వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీలు జరి గాయని చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. బొ గ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతీ దశలో డిజిటల్ పర్యవేక్షణ, భద్రతా తనిఖీలు, ఆన్‌లైన్ రికార్డింగ్ వ్యవస్థలు అమల్లో ఉంటాయని, బొగ్గు మాయమవడం, చోరీ జరగడానికి అస్కారం లేదన్నారు. ఈవిషయంలో వాస్తవాలు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. సంస్థను, సంస్థలో పనిచేసే ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసేలా వాఖ్యలు ఉండవద్దన్నారు.


