మంథని: మాస్టర్ ప్లాన్‌తో మంథని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. పేదవాడి అభివృద్ధి ఏమాత్రం పట్టించుకొని ప్రతిపక్ష పార్టీలు.. నేడు అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న తమపై దురద జల్లుతున్నాయన్నారు. మంథనిలో మహిళల ఉపాధికి కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని, 400 మందికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మంథనిలో 2 కంపెనీలు నెలకొల్పనున్నట్లు చెప్పారు. మంథని పట్టణం నుంచి పుట్టపాక వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు త్వరలో మొదలవుతాయని, నిర్మాణాలు కోల్పోతున్న వారు సహకరించాలని కోరారు. ఆర్డీవో సురేశ్, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, నాయకులు శశిభూషణ్ కాచే, ఐలి ప్రసాద్ తదితరులున్నారు.
‘నీట్’ కోసం ఉచితంగా బస్సు
విద్యానగర్(కరీంనగర్): ఆదివారం జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు శనివారం తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించి, తమ ఇళ్ల నుంచి పరీక్ష కేంద్రాలకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఏసీ బస్సులు మినహా మిగితా అన్ని బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.
24న ఇంటర్వ్యూ
పెద్దపల్లి: పెద్దపల్లి ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఈనెల 24న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ కె.శ్రీధర్ తెలిపారు. ఆసక్తి గల వైద్యులు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలన్నారు. సివిల్ అసిస్టెంట్ స ర్జన్‌కు వేతనం రూ.52,351 ఉంటుందని, ఇత ర వివరాలకు 94924 57809, 84990 61999 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
ప్రతి చిన్నారి ఆరోగ్య భద్రతే లక్ష్యం
పెద్దపల్లి: జిల్లాలోని ప్రతి చిన్నారికి ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, పల్స్ పోలియో, పెద్దపల్లి, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈనెల 28న పల్స్ పోలియో బూత్ డే నిర్వహించి, 29,30వ తేదీల్లో ఇంటింటా సందర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 0 నుంచి ఐదేళ్ల లోపు 62,902 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 2,27,251 మంది పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, గోదావరిఖని ఆస్పత్రి సూపరింటెండెంట్ హిమబిందుసింగ్, తదితరులు పాల్గొన్నారు.
ఇసుక తరలిస్తే ఊరుకోం
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామ పరిధి మానేరువాగు నుంచి ఇసుక తరలిస్తే ఉరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు అన్నారు. శనివారం ఇసుక లారీలను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. మానకొండూర్ మండల పరిధిలోని మానేరువాగు వైపు ఏటీఎస్‌ఎండీసీ ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతి ఉండగా తమ గ్రామ పరిధిలోకి వచ్చి ఇసుక తోడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిధిలోకి వస్తే అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీంతో ఇసుక లారీలు వెనక్కి వెళ్లిపోయాయి.


