జిల్లాకు మరిన్ని పురస్కారాలు తేవాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు మరిన్ని పురస్కారాలు తేవాలి

Jun 21 2026 8:16 AM | Updated on Jun 21 2026 8:16 AM

● విప్‌ విజయరమణారావు

పెద్దపల్లి: విద్యా ప్రమాణాల పెంపులో జిల్లా అగ్రగా మిగా నిలిచినందుకు ఆనందంగా ఉందని, జిల్లాకు మరిన్ని పురస్కారాలు తెచ్చేలా యంత్రాంగం పని చేయాలని విప్‌ చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్షను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా ప్రమాణాల పెంపులో జిల్లా అగ్రగామిగా నిలిచినందుకు హైదరాబాద్‌లో సీఎం చేతుల మీదుగా కలెక్టర్‌, డీఈవో అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

యూరియా సరఫరాలో దేశానికే ఆదర్శం

యూరియా సరఫరాకు యాప్‌ ఆధారిత విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డితో కలిసి యూరియా బుకింగ్‌ యాప్‌ వినియోగంపై ఎరువుల డీలర్లు, వ్యవసాయ అధికారులు, రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. యాప్‌ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించగా వారు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ పొందాలంటే రైతులు బీపీటీ, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్‌, తెలంగాణ సోనా, వరంగల్‌–44, 1638, 7715 అనే సన్న వరి రకాలను సాగు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలు సిద్ధంగా ఉంచామని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు, డీలర్లను ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో 20 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా, వారం రోజుల్లో మరో 4 వేల మెట్రిక్‌ టన్నులు రైల్వే ద్వారా చేరనున్నాయని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి మరో 2 వేల మెట్రిక్‌ టన్నుల సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులకు అవసరానికి మించి యూరియా వాడొద్దని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌, జిల్లా సహకార అధికారి శ్రీమాల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement