దాహం.. దాహం | - | Sakshi
Sakshi News home page

దాహం.. దాహం

Jun 21 2026 12:13 AM | Updated on Jun 21 2026 12:13 AM

వానాకాలమొచ్చినా వరుణుడు కన్నెత్తి చూడడం లేదు. భానుడు ఇంకా భగభగమంటూ తన ప్రచండ తాపాన్ని చూపుతున్నాడు. మండే ఎండలకు వానర మూకలు దప్పికతో అల్లాడుతున్నాయి. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో కులాయి వద్ద నీరు తాగేందుకు యత్నించి భంగపడ్డ ఓ వానరం, పక్కనే ఓ పాసింజర్‌ బ్యాగులో కనిపించిన వాటర్‌బాటిల్‌ను ఇలా లాక్కొని, దాని కింది భాగాన్ని కొరికి దప్పిక తీర్చుకుంది. రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు ఇదంతా ఆసక్తిగా గమనించారు.

– పెద్దపల్లిరూరల్‌

23న బంద్‌ విజయవంతం చేయండి

సిరిసిల్ల అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్వహించే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సోషల్‌ మీడియా కన్వీనర్‌ పెండ్యాల శివ కోరారు. సిరిసిల్లలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని కోరారు.

బావిలో పడి బాలుడి మృతి

కొత్తపల్లి: కరీంనగర్‌ పరిధిలోని రేకుర్తిలోని బతుకమ్మ చెరువు బావిలో పడి బాలుడు మృతిచెందాడు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్‌ వివరాల ప్రకారం.. రేకుర్తిలోని స్వామికాలనీకి చెందిన షకీర్‌ఖాన్‌ అలియాస్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ (16) తన స్నేహితులు షేక్‌ అఫ్రోజ్‌, యాకుబ్‌ అలీ, షకీర్‌ఖాన్లతో కలిసి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాలనీ సమీపంలోని బతుకమ్మ చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. చెరువు సమీపంలోని ఓ బావి వద్ద ఆడుకుంటుండగా షకీర్‌ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. తనతో ఉన్న స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే వారు షకీర్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బటయకు తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement