కోల్‌సిటీ: వేర్వేరు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఇద్దరి నేత్రాలను దానం చేసి రెంటు కుటంంబాలు ఆదర్శంగా నిలిచాయి. గోదావరిఖని కాకతీయనగర్‌కు చెందిన డి.రఘు (46) శుక్రవారం చెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయాలుకావడంతో వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన సింగరేణి ఉద్యోగి రాజు (29) శనివారం తెల్లవారుజామున గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం కరీంనగర్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. మృతుల కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ ఇద్దరి నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. ఈ నేత్రాల ద్వారా నలుగురు దృష్టి లోపం ఉన్న వారికి చూపు అందనుంది. విషాద సమయంలోనూ నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, కేఎస్ వాసు, వెల్ది కవిత అనంతరాములు, తడబోయిన రాములు, దేవి లక్ష్మీ నరసయ్య తదితరులు అభినందించారు.
సిరిసిల్లటౌన్: మెడికల్ కాలేజీ, ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ నాయకులు కోరారు. ఈమేరకు జిల్లా ప్రభుత్వాస్పత్రి, మెడికల్ కాలేజీలో శనివారం వినతిపత్రాలు అందించి మాట్లాడారు. పీఎఫ్, ఈఎస్‌ఐ నిబంధనలు అమలు చేయాలని, యజమాని వాటాను ప్రభుత్వమే చెల్లించాలని, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈనెల 22న కలెక్టరేట్ వద్ద ధర్నా, 25, 26 తేదీల్లో జిల్లా ఆస్పత్రి వద్ద రిలే నిరసన దీక్షలు, 30న ప్రగతి భవన్ ముట్టడించనున్నట్లు తెలిపారు. యూనియన్ ప్రతినిధులు మారవేణి మహేశ్, బండారి హరీశ్‌కుమార్, సుంకపాక మౌనిక, రాధ, పులి శారద, రూప, స్రవంతి పాల్గొన్నారు.


