నర్సరీలు.. నాణ్యమైన మొక్కలు | - | Sakshi
Sakshi News home page

నర్సరీలు.. నాణ్యమైన మొక్కలు

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

పెద్దపల్లిరూరల్‌: కూరగాయల పెంపకంపై పలువురిలో ఆసక్తి పెరిగింది. పెద్దపల్లి ప్రాంతంలోని హన్మంతునిపేట, పెద్దకల్వల, పెద్దబొంకూర్‌, కొత్తపల్లి, గౌరెడ్డిపేట, ముత్తారం తదితర గ్రామాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తుండగా.. పెద్దపల్లి శివారు బందంపల్లికి చెందిన వృద్ధ దంపతులు ఆకుకూరలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్దకల్వలలో కొందరు నర్సరీలు ఏర్పాటు చేసి పూలు, కూరగాయల మొక్కలు సిద్ధంచేసి అన్నదాతలకు విక్రయిస్తున్నారు.

మేలు రకం మొక్కలతో మంచి దిగుబడి

నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను నాణ్యమైన వాటిగా గుర్తించాకే కొనుగోలు చేయాలని ఉద్యానవన అధికారులు సూచిస్తున్నారు. మేలురకం మొక్కల సాగుతోనే మంచి దిగుబడి సాధించవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. కూరగాయల పండించే రైతులు మంచిదిగుబడితో నిత్యం ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నర్సరీల్లో మొక్కలు పెంచే నిర్వాహకులు ఆరోగ్యవంతమైన నారునే (చీడ,పీడలు, తెగుళ్లను తట్టుకునేలా)అందించాలంటున్నారు.

పెరటితోటల పెంపకంపై ఆసక్తి

కొందరు తమ ఇంటి ఆవరణలోని కొద్దిపాటి ఖాళీస్థలంలో కూరగాయల మొక్కలను పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. టమాట, వంకాయ, చిక్కుడు, దొండ, కాకర, బీర లాంటి కూరగాయల మొక్కలను నాటి ఇంటి అవసరాలను తీర్చుకునేలా ప్రణాళిక చేసుకుంటున్నారు. స్థల లభ్యతను బట్టి మొక్కల సంఖ్యను నిర్ధారించుకుంటున్నారు. దీంతో ఇంట్లోనే తాజా కూరగాయలను పొందేందుకు అవకాశముంటుందని పేర్కొంటున్నారు.

నర్సరీ నిర్వహణకు లైసెన్స్‌ తప్పనిసరి

నర్సరీలను నిర్వహించే వారు తప్పనిసరిగా అధికారుల నుంచి లైసెన్స్‌ తప్పనిసరిగా పొందాలి. ఏటా రెన్యూవల్‌ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే నిర్వాహకులపై తెలంగాణ నర్సరీల నమోదు చట్టం – 2017 ప్రకారం నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించినట్టు గుర్తిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు నమోదు చేయాలి

నర్సరీల్లో మొక్కల పెంపకానికి అవసరమైన విత్తన కొనుగోలు, నారు ఉత్పత్తి, నిల్వలు, విక్రయాలు తదితర వివరాలను తప్పనిసరిగా రిజిష్టర్లలో నమోదు చేయాలి. రైతులకు విక్రయించే సమయంలో రసీదు ఇవ్వాలి. నర్సరీల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఉండాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకు లను అధికారులు హెచ్చరిస్తున్నారు.

కూరగాయల మొక్కలకు భలే గిరాకీ

పెరటితోటల పెంపకంపై ఆసక్తి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement