అదనపు కలెక్టర్‌గా వెంకట్‌ రెడ్డి | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్‌గా వెంకట్‌ రెడ్డి

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

పెద్దపల్లి: జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా కొప్పుల వెంకట్‌ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీవో)గా విధులు నిర్వహించిన వెంకట్‌ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా పదోన్నతి కల్పించడంతో పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేశారు. ఆయనకు డీఆర్‌వో రాజేశ్వరి, కలెక్టరేట్‌ ఏవో బండి ప్రకాశ్‌, సిబ్బంది పూల మొక్క అందించి స్వాగతం తెలిపారు.

విద్యుత్‌ పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

గోదావరిఖని: వర్షాకాలం సమీపిస్తున్నందున గనులపై విద్యుత్‌ పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని సేఫ్టీ కమిటీ బృందం సూచించింది. సోమవారం ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–1, 3 గనిని సందర్శించింది. గని ఉపరితలం, గనిలోపల విద్యుత్‌పరికరాల తీరు, వాటి నిర్వహణ తీరుపై తనిఖీలు నిర్వహించారు. గనుల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. సింగరేణి సంస్థలో సురక్షితమైన పని వాతావరణం కల్పించడమే లక్ష్యంగా భద్రతా తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. తనిఖీలో సే ఫ్టీ ఆఫీసర్‌ బీవీ సత్యనారాయణ, వీకేపీ గ్రూప్‌ ఇంజినీర్‌ కె.గోపాలకృష్ణరెడ్డి పాల్గొన్నారు.

అక్రమాలపై విచారణ

కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయని మాజీ కార్పొరేటర్‌ నగునూరి సుమలత రాజు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పురపాలక శాఖ వరంగల్‌ ప్రాంతీయ సంచాలకుడు (ఆర్డీ) షాహిద్‌ మసూద్‌ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈనెల 6న ఒకసారి విచారణ చేపట్టిన ఆర్డీ, రెండోసారి విచారణ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్‌లోని ఆర్డీ కార్యాలయంలో సంబంధిత అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించారు. విచారణకు నగరపాలక సంస్థకు చెందిన ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు హాజరైనట్లు సమాచారం.

అందుబాటులో చర్మవ్యాధుల చికిత్స

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చర్మ వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, చొరవ తీసుకొని చర్మ వ్యాధుల చికిత్సకోసం పరికరాలను అందుబాటులోని తీసుకువచ్చారని అన్నారు. ఈ పరికరాల సహాయంతో చర్మంపై ఏర్పడే పులిపిరులు, స్కిన్‌ ట్యాగ్‌లను తొలగించవచ్చని, ఇతర చిన్న చర్మ సంబంధిత సమస్యలకు చికిత్స అందించవచ్చని తెలిపారు.

ఆయిల్‌పాం సాగుతో అధిక ఆదాయం

మంథనిరూరల్‌: ఆయిల్‌పాం పంట సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాంప్రసాద్‌ అన్నారు. సోమవారం మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన నెత్తెట్ల మల్లయ్యకు చెందిన తోటలో ఆయిల్‌పాం మొక్కలు నాటారు. ఆయిల్‌పాం, డ్రాగన్‌ ప్రూట్‌, బొప్పాయి, కూరగాయల తోటలను ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తూ సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. ఒక ఎకరానికి 50 నుంచి 57 ఆయిల్‌పాం మొక్కలను నాటుకోవచ్చని, ఒకసారి ఈ పంట నాటితే 30 ఏళ్ల పాటు దీర్షకాలికంగా దిగుబడి వస్తుందన్నారు. ఒక ఎకరం పంటకు సుమారు రూ.లక్ష వరకు ఆదాయం పొందవచ్చని, ఉద్యాన వన పంటల్లో ఆయిల్‌పాంకు మంచి డిమాండ్‌ ఉందని తెలిపారు. ఉద్యానవన డివిజన్‌ అధికారి జ్యోతి, విస్తరణ అధికారి రాజశేఖర్‌, డ్రిప్‌ కంపెనీ సిబ్బంది తిరుమల, పామాయిల్‌ కంపెనీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement