గోదావరిఖని: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసుశాఖ ముందుకు సాగుతోందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా అన్నారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పలువురు బాధితుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి సంబందిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీపీ(అడ్మిన్) కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఈనెల 20న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా ఒక ప్రకటనలో తెలిపారు. రాజీకి అనువైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూళ్లు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు వంటి అంశాల్లో ఇరుపక్షాలు చర్చించుకొని లోక్ అదాలత్ ద్వారా రాజీకి రావచ్చన్నారు.
సొమ్ము వృథా కోసమే డిప్యూటీ సీఎం పర్యటన
గోదావరిఖని: సింగరేణి సొమ్ము వృథా కోసమే డిప్యూటీ సీఎం కారుణ్య నియామకపత్రాలు అందజేయడానికి వచ్చారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సోమవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 335 మెడికల్ ఇన్వాలిడేషన్ కార్మికుల పిల్లలకు నియామక పత్రాలు ఇవ్వడానికి రూ.50లక్షలు ఖర్చుచేశారన్నారు. సంస్థను ఇంకా నష్టాల పాలుచేయాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. సమావేశంలో యూని యన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్య, అధికా ర ప్రతినిధి పర్లపల్లి రవి, నాయకులు పాల్గొన్నారు.


