పెద్దపల్లి: ప్రజల నుంచి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కొప్పుల వెంకట్‌రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఓదెల గ్రామ పంచాయతీ పరిధిలో మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూల్ సెంటర్‌ను హైస్కూల్ ప్రాంగణంలోకి మార్పు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కనకిరెడ్డి సతీశ్ దరఖాస్తు చేసుకోగా జిల్లా విద్యాశాఖ అధికారికి రాస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దపల్లి పట్టణం ప్రగతినగర్‌కు చెందిన కొండా రమాదేవి తమకు గృహ జ్యోతి పథకం కింద లబ్ధి చేకూర్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీవోకు రాస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ ఏవో బండి ప్రకాశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


