పెద్దపల్లికి చెందిన ముస్త్యాల సౌజన్య సిరిసిల్లలో జన్మించింది. ఆ సమయంలో పొందిన సర్టిఫికెట్‌ను సవరించేందుకు ఈఏడాది మే 22న మీసేవలో దరఖాస్తు చేసింది. పరిశీలించిన సిరిసిల్ల మున్సిపల్ అధికారులు.. ఆఫీసులో అప్లికేషన్ ఇవ్వలేదనే కారణంతో ఈనెల 4న తిరస్కరించారు.
ధర్మారం మండలానికి చెందిన ఓ వ్యక్తి మంచిర్యాల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోగా.. ధర్మారం మండలంలోని పంచాయతీ కార్యదర్శి ఏమాత్రం స్పందించలేదు. ఇదేమని అడిగితే.. తమను కలిస్తేనే సర్టిఫికెట్ వస్తుందని చెప్పారు. దీంతో ఆ యువకుడు టోల్‌ఫ్రీ 1100 నంబరుకు ఫిర్యాదు చేశాడు. అధికారులు మందలించడంతో వెంటనే సర్టిఫికెట్ మంజూరు చేశారు.
పెద్దపల్లిరూరల్: ప్రజలకు సులభంగా, వేగంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మీసేవ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో దరఖాస్తు చేస్తే చాలు.. సంబంధిత శాఖ అధికారులు మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశీలించి సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు జారీచేసింది. సర్టిఫికెట్ల కోసం హార్డ్‌కాపీలను ఆఫీసుల్లో అందజేయా ల్సిన అవసరం లేదని తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. అయినా, కొన్ని మున్సిపల్, రెవెన్యూ, కార్పొరేషన్‌ల అధికారులు ఆ ఆదేశాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారనే ఫిర్యాదు లున్నాయి. అందుకు సిరిసిల్ల మున్సిపల్ అధికారులు బర్త్ సర్టిఫికెట్ సవరణ దరఖాస్తు తమ కార్యాలయంలో ఇవ్వలేదని తిరస్కరించడమే నిదర్శనం.
ఆఫీసులో కలిస్తేనే పని అవుతుందట!
సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నా సర్టిఫికెట్లు జారీ చేయడంలో కొందరు అధికారులు జాప్యం చేస్తున్నారు. ఇదేమని అడిగితే ఆఫీసుకు వచ్చి తమను కలిస్తేనే పనిఅవుతుందంటున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు.. వాటిని తుంగలో తొక్కి తమను ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటున్నారు.
హార్డ్‌కాపీ ఉంటేనే మేలు..
విద్యా సంవత్సరం ఆరంభమవుతుండడంతో వి ద్యార్థుల చదువు, పోటీపరీక్షల కోసం అవసరమైన కులం, ఆదాయం, నివాస పత్రాలను చాలావరకు జారీ చేశారు. అయితే పుట్టిన తేదీ, ఈడబ్ల్యూఎస్, ఫ్యామిలీ మెంబరు లాంటి సర్టిఫికెట్లకు దరఖాస్తులను(హార్డ్‌కాపీలు) అందించడమే మంచిదని రెవె న్యూ అధికారి ఒకరు తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చిన అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడం పెద్దపనిగా మారిందని వాపోయారు. కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు కచ్చితంగా తమకు దరఖాస్తులను తెచ్చి ఇవ్వాల్సిందేనని మీసేవ కేంద్రాల నిర్వాహకులకు హుకుం జారీ చేస్తున్నారని సమాచారం.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏది?
మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సులువుగా.. వేగంగా సేవలను అందించేందుకు ఇదివరకు ఉన్న చార్జీలను ప్రభుత్వం పెంచింది. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో పంపించే అప్లికేషన్‌లను సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పరిశీలిస్తున్నారా? జాప్యం చేయడానికి గల కారణాలేమిటి? తదితర అంశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైందని, దీంతోనే దరఖాస్తుదారులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, అత్యవసరమనుకుంటే ఆఫీసుకు వెళ్లి సదరు అధికారిని ప్రసన్నం చేసుకుంటేనే పనిపూర్తవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
సర్కారు ఆదేశాలు బుట్టదాఖలు
బర్త్ సర్టిఫికెట్ సవరణ కోసం దరఖాస్తు
హార్డ్‌కాపీ ఇవ్వలేదని తిరస్కరణ
సిరిసిల్ల మున్సిపల్ అధికారుల తీరు
ఉమ్మడి జిల్లాలోనూ అనేక ఫిర్యాదులు
దరఖాస్తు చేస్తే చాలు
తమకు అవసరమున్న సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అందుకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ సంబంధిత ఆఫీసుల్లో అప్పగించాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ల జారీకోసం ఈఎస్‌డీ అభివృద్ధి చేసిన జీపీవోఎస్, ఎంఆర్‌ఐ వెరిఫికేషన్ మొబైల్ అప్లికేషన్ అమలులో ఉంది. ఈ యాప్ ద్వారా సదరు అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించి ఆమోదించడమో.. తిరస్కరించడమో చేస్తారు.
– కవిత, ఈడీఎం, పెద్దపల్లి


