మంథనిరూరల్: సాధారణంగా వానాకాలం సీజన్ ప్రారంభం కాగానే తొలకరి పులకరింపుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ సాగుబాట పడుతుంటారు. వేసవిలోనే దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటారు. తొలకరి కురవగానే విత్తనాలు విత్తేందుకు యత్నిస్తుంటారు. కానీ, ఈసారి తొలకరిలో రైతులు తొందరపడి విత్తనాలు విత్త వద్దంటూ ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈసారి వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అకాశాలు ఉన్నాయని, దీంతో రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
పంట సాగు ప్రణాళికలు సిద్దం..
జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో సాగు ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ అధికారులు.. పంటలపై పలు సూచనలు చేస్తున్నారు. ఈసారి సుమారుగా 2.15లక్షల ఎకరాల్లో వరి, 52వేల ఎకరాల్లో పత్తితోపాటు ఇతర పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు ప్రణాళికలపై తర్జనభర్జన పడుతున్నారు. వరి, పత్తి విషయంలో రైతులు ఆలోచన చేయాలని విస్త్రత ప్రచారం చేస్తున్నారు.
తేమశాతం వచ్చాకే..
వేసవిలో దుక్కులు ఎండతీవ్రతకు వేడితో ఉంటాయని, తొలకరితో నేలలోపలి పొరల నుంచి వేడివస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఒకమోస్తారు నుంచి భారీ వర్షం కురిస్తే నీరు భూమిలోకి ఇంకి వేడి తగ్గుతుందంటున్నారు. తొలకరి వర్షాలకు విత్తనాలు నాటితే వేడికి మొలకెత్తవని, మాడిపోతాయని అవగాహన కల్పిస్తున్నారు. ఈక్రమంలో భూమిలో సరైన తేమ వచ్చిన తర్వాతనే విత్తనాలు విత్తితే మొలకెత్తుతాయని చెబుతున్నారు.
వర్షాలు ఆలస్యం ఆవుతుండటంతో..
వానాకాలంలో వర్షాలు ఆలస్యం కావడంపై ఇటు రైతుల్లో అటు అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముందస్తు సాగుకు సిద్ధమైతే.. రైతులు నష్టపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెలలో పంటలు వేయకపోతే చేతికందే సమయం ఆలస్యం అవుతుందని రైతులు అంటున్నారు. వరి, పత్తి సాగు చేసే రైతులు ఇప్పటికే నేల దుక్కిదున్ని విత్తనాలు నాటేందుకు సిద్ధం చేసుకున్నారు. సరైన వర్షాపాతం నమోదు తర్వాతనే పత్తి విత్తనాలు విత్తాలని, వరి నారు మడులు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆరుతడి సాగు వైపు...
ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉందని, ఆరుతడి పంటలు వేయాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వరి విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని, స్వల్పకాలిక వంగడాలనే ఎంచుకోవాలని చెబుతున్నారు. అలాగే తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
నేలలో తగిన తేమశాతం ఉంటేనే చల్లుకోవాలి
భూమి లోపలి పొర వేడికి విత్తనాలు మాడిపోతయ్
ఈసారి సాధారణ వర్షాలే అంటున్న అధికారులు
అధిక ఉష్ణోగ్రతల ప్రభావం
ఈసారి ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్ర మంలో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు విత్తుకోవద్దు. నేలలో వేడి ఉండడంతో విత్తనాలు మాడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు కురిసినా తదుపరి వర్షపా తం ఎలా ఉంటుందో తెలుసుకుని స్వల్పకాలి క వరి, ఆరుతడి పంటలు సాగు చేసుకోవడ మే మేలు.ఈ విషయంపై ప్రతీగ్రామంలో రై తులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీరైతు వానాకాలం పంటలపై అప్రమత్తంగా ఉంటూ మా సలహాలు, సూచనలు పాటించాలి.
– డాక్టర్ నవ్య,
మండల వ్యవసాయ అధికారి, మంథని


