కెమెరా చూస్తోంది! | - | Sakshi
Sakshi News home page

కెమెరా చూస్తోంది!

Jun 7 2026 12:09 AM | Updated on Jun 7 2026 12:09 AM

అడుగడుగునా నిఘా జిల్లాకేంద్రంలో 135 సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో ఇవే కీలకం గల్లీల్లోనూ ఏర్పాటుకు పోలీసుల ప్రోత్సాహం

పెద్దపల్లిలో బుధవారం సీసీ కెమెరాలు ప్రారంభిస్తూ రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్న మాటలివీ.

జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా పటిష్టంగా ఉంది. అందుకే కరీంనగర్‌ నగల దుకాణంలో చోరీకోసం వచ్చిన దొంగలు.. తొలుత రైలుమార్గం ద్వారా పెద్దపల్లికి వచ్చారు.. ఇక్కడ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలుసుకుని.. తమ పప్పులేమీ ఉడకవని భావించే ఇతర మార్గాలు ఎంచుకున్నారు.

పెద్దపల్లిరూరల్‌: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ఆధునిక సాంకేతికతతో ముందుకు సాగుతోంది. గతంలో కొన్ని నేరాల్లో సరైన ఆధారాలు లభించక నేరస్తులను పట్టుకోవడంలో పోలీసు అధికారులకు సవాల్‌గా ఉండేది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్దపల్లిలోని ప్రధాన రహదారులతో పాటు ముఖ్యమైన కాలనీలు, గల్లీల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రోత్సహించడం సత్పలితాలనే ఇస్తోంది.

కేసుల ఛేదనలో..

కొంతకాలం క్రితం పెద్దపల్లిలోని పాతబజార్‌లో గల ఓ నగల దుకాణానికి పట్టగొలుసులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన మహిళలు.. వెండి అభరణాలను ఎత్తుకెళ్లారు. ఆభరణాలు మాయమయ్యాయని గుర్తించిన షాపు యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు.. నిందితుల జాడ కొనుగోలు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇలా అనేక నేరాలను సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకోవడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు.

దాతలకు ప్రోత్సాహం

జిల్లా కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు విస్తతంగా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు.. దాతల సహకారంతో ముఖ్యప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా చొరవ చూపుతున్నారు. పెద్దపల్లిలోని ప్రధాన రోడ్లు, కూడళ్లలో హైఫ్రీకెన్వ్సీ గల కెమెరాలు ఉండడంతో నేరస్తుల ఆగడాలకు కళ్లెం వేసినట్టు అయింది.

ట్రాఫిక్‌ కూడళ్లలోనూ..

పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. కొన్నిసందర్భాల్లో జరిమానా విధిస్తున్నారు. దీంతో నిబంధనలు అతిక్రమించేందుకు వాహనదారులు సాహసించడం లేదు.

జిల్లా కేంద్రంలో 135 సీసీలు

జిల్లాకేంద్రమైన పెద్దపల్లిలో ఇప్పటివరకు 70 సీసీ కెమెరాలు నిఘాలో పాలుపంచుకోగా.. రిక్రియేషన్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం, కౌన్సిలర్‌ ఇల్లందుల రజని– కృష్ణమూర్తి, రంగు శ్రీనివాస్‌ తదితరుల సహకారంతో ఇటీవల మరో 65 సీసీ కెమెరాలను బుధవారం (ఈనెల3న) ప్రభుత్వ విప్‌ విజయరమణారావు, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా ప్రారంభించిన విషయం విదితమే.

డీజీపీ కార్యాలయం నుంచి పర్యవేక్షణ

జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాలు, పోలీస్‌స్టేషన్లలో అమర్చిన సీసీ కెమెరాలను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో గల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగే ఘటనలను ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షించేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ఘటనల సమగ్ర సమాచారాన్ని అధికారులు నేరుగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉండేలా ఏర్పాట్లు చేశారు. తమగోడు చెప్పుకుని ఫిర్యాదు చేసేందుకు ఠాణాలకు వచ్చేవారితోనూ పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించే తీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు ఆస్కారం దీని ద్వారా ఉంటుంది.

మరిన్ని ఏర్పాటు చేయిస్తా

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్రకీలకంగా ఉంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వ్యాపారులు, ఆర్థికంగా ఉన్నవారు తమ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. రాంపల్లి, చందపల్లిలోని డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లకాలనీల్లోనూ వీటి ఏర్పాటుకు నిధులు కేటాయిస్తాం. – విజయరమణారావు, ప్రభుత్వ విప్‌

Advertisement
 
Advertisement
Advertisement