పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందినవారే. వీరు ఉదయం పూట అల్పాహారం లేదా భోజనం చేయడం చాలా అరుదు. అప్పటికే కాలేజీ సమయం సమీపిస్తుండడంతో చాలామంది పస్తులతోనే కళాశాలలకు చేరు కుంటున్నారు. మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లి భోజనం చేసి మళ్లీ తరగతులకు హాజరు కావడం సాహసంతో కూడుకున్నది. ఒకవేళ ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మళ్లీ కాలేజీలకు హాజరు కాలేకపోతున్నారు. తద్వారా హాజరు శాతం కూడా పడిపోతోంది. వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్నం భోజనం అందించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీల్లోని పేద విద్యార్థుల కోసం ఇప్పటికే మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబా పూలేతోపాటు పలు హాస్టళ్ల మాదిరిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది.
జిల్లాలో పదివేల మందికిపైగా లబ్ధి
జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో బాలికల కోసం ప్రత్యేక కాలేజీలూ నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లో ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దాదాపు పది వేల మందికిపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు సౌజన్యంతో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం అందజేశారు.
హాజరు మెరుగుపడేలా..
పేద విద్యార్థులు కళాశాలలకు గైర్హాజరవుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. హాజరు శాతం పెంచడంతోపాటు మధ్యాహ్న భోజనం అందిస్తే ఆకలి తీరి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సైతం పెరుగుతుందని భావిస్తోంది. ఇటీవల అధికారులు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. తద్వారా 2026– 27 విద్యా సంవత్సరం నుంచే మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ కాలేజీల్లోనే చేరాలి
ప్రభుత్వ కళాశాలల్లో చేరాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు కోరుతున్నారు. ఈమేరకు ప్రచార పోస్టర్‌ను ఆయన ఇటీవల ఆవిష్కరించారు. సర్కారు కాలేజీల్లో చదివే విద్యార్థులకు నోట్‌బుక్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, పీఈసెట్, నీట్, జేఈఈ మెయిన్స్ తదితర పోటీ పరీక్షలకు ప్రథమ సంవత్సరం నుంచే ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామని వివరించారు.
జూనియర్ కాలేజీల్లో ‘మధ్యాహ్న భోజనం’
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు నిర్ణయం
పది వేల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం


