నేలకు సారం.. దిగుబడి అధికం | - | Sakshi
Sakshi News home page

నేలకు సారం.. దిగుబడి అధికం

Jun 7 2026 12:09 AM | Updated on Jun 7 2026 12:09 AM

● పచ్చిరొట్ట సాగుతో సేంద్రియ పదార్థం వృద్ధి చెంది నేల సారవంతమవుతుంది ● నేలలో నైట్రోజన్‌ స్థాయి పెరుగుతుంది ● భూమి గట్టితనం తగ్గి మెత్తగా తయారవుతుంది ● సూక్ష్మధాతువులు పెరిగి మట్టి ఆరోగ్యంగా మారుతుంది ● భూసారం పెరగడం ద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గడంతోపాటు పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుంది ● పర్యావరణహితంగా మారి సుస్థిరమైన వ్యవసాయానికి దోహదపడుతుంది.

భూసారం పెరిగి దిగుబడికి దోహదం

రైతులకు అందుబాటులో జీలుగ విత్తనాలు

50శాతం రాయితీపై అందిస్తున్న ప్రభుత్వం

మంథనిరూరల్‌: పంట దిగుబడిలో పచ్చిరొట్ట పా త్ర అంత్యంత కీలకం. పంటకాలం ముగిశాక భూసారం పెంచుకుని మంచి దిగుబడి కోసం పచ్చిరొట్టను పొలాల్లో వేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా అందిస్తోంది. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న క్రమంలో రైతులకు జీలుగ, జనుము విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పీఏసీఎస్‌లు, ఆగ్రో కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది.

రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా..

ఆధునిక పద్ధతుల్లో వివిధ పంటలు పండిస్తున్న అన్నదాతలు.. రసాయన ఎరువులను సైతం ఎక్కువగానే వినియోగిస్తున్నారు. అధికారుల సూచనలు పాటించకపోవడం, మోతాదుకు మించి రసాయనాలు వాడటం, పంట అవశేషాలను పొలాలు, చేన్లలోనే కాల్చివేయడంతో సారవంతమైన భూము ల్లో సైతం దిగుబడి అంతంత మాత్రంగానే వస్తోంది. ముఖ్యంగా పంట మార్పిడి విధానం పాటించకపోవడం కూడా దిగుబడిపై ప్ర భావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలో భూమిలో సారం పెంచేలా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పి స్తూ పచ్చిరొట్ట వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.

50 శాతం రాయితీపై విత్తనాలు

వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రైతులకు 50శాతం రాయితీపై జీలుగ, జనుము విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని మంథని మండలానికి 500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. జీలుగ కిలో రూ.163.50 ఉండగా రాయితీపై రూ.81.75, జనుము కిలోకు రూ.155.50 ఉండగా రాయితీపై రూ.77.75కు అందించనున్నారు. ఇందులో 30 కిలోల బ్యాగులు ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. జీలుగ విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ జిరాక్స్‌లతో వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించాలని వారు రైతులకు సూచించారు.

ఇవీ ప్రయోజనాలు

అవగాహన కల్పిస్తున్నాం

వానాకాలం సాగు సిద్ధమవుతున్న రైతులు పచ్చిరొట్ట ఎరువును వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచాం. ప్రతీరైతుకు విత్తనాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పచ్చిరొట్ట వినియోగంతో అనేకలాభాలు ఉన్నాయి. ముఖ్యంగా భూమిసారం పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

– నవ్య,

మండల వ్యవసాయ అధికారి, మంథని

పచ్చిరొట్టతో అనేక ప్రయోజనాలు

Advertisement
 
Advertisement
Advertisement